కరకగూడెం/పినపాక: వలస ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, సంక్షేమం కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శుక్రవారం వలస ఆదివాసీ గ్రామం నీలాద్రిపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పినపాక మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీ దేవగిరి నగరంలో ఉన్న ప్రాచీన రాకాసి గూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని సూచించారు. చట్ట వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసేకుంటూ విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు అందేలా చూస్తామన్నారు. గ్రామాల్లోకి అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం మహిళలకు చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. యువతకు టీ షర్టులు, వాలీబాల్ కిట్లు అందజేశారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటుబుక్స్, సోలార్ స్టడీ ల్యాంపులను పంపిణీ చేశారు. కాసేపు యువతతో వాలీబాల్ ఆడి సందడి చేశారు. వైద్య శిబిరంలో దాదాపు 300 మంది ఆదివాసీలు సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేందర్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పీవీఎన్.రావు, సురేష్, ప్రభుత్వ వైద్యాధికారి రవితేజ పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు


