దుమ్ముగూడెం: మండలంలోని కె.రేగుబల్లి–2 బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం భారతిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని తండ్రి పాయం కార్తీక్ ఐటీడీఏ డీడీ అశోక్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. విద్యార్థిని పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గతంలో పాఠశాలలో మెనూ సరిగా లేకపోవడంతో సదరు విద్యార్థిని ఆశ్రమ పాఠశాల తనిఖీకి వచ్చిన అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎం భారతి తన కుమార్తెను నిరంతరం మానసిక వేధింపులకు గురిచేస్తోందని, భరించలేక ఈ నెల 4వ తేదీన నెయిల్ పాలిష్ బాటిల్‌ను పొడి చేసి మింగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మూడు ఇసుక లారీలు స్వాధీనం
అశ్వారావుపేటరూరల్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను స్థానిక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రం కొవ్వూరు గోదావరి ర్యాంపు నుంచి మూడు లారీల్లో ఇసుకను అశ్వారావుపేట మీదుగా తరలిస్తుండగా, సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో విచారణ చేసి జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో శానిటైజర్ తాగిన మహిళ
ఇల్లెందు: ఇంటి నుంచి పారిపోయిన వివాహితను పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా.. ఆమె అక్కడి శానిటైజర్ తాగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన విజయలక్ష్మి మూడు నెలలు కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళను గుర్తించి, విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆమె అక్కడే ఉన్న శానిటైజర్ సేవించింది. ఆమెను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించి, కౌన్సెలింగ్ నిర్వహించి, భర్తకు అప్పగించినట్లు సీఐ సురేశ్ తెలిపారు.


