విశిష్టం.. రామయ్య తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

విశిష్టం.. రామయ్య తలంబ్రాలు

Mar 12 2026 7:31 AM | Updated on Mar 12 2026 7:31 AM

ముత్యాలు ఎందుకంటే..

భద్రగిరి సీతారాముల కల్యాణ అక్షితలపై భక్తుల ఆసక్తి

ఈ ఏడాది 400 క్వింటాళ్ల తయారీకి ఏర్పాట్లు

తానీషా కాలం నుంచి ముత్యాలు సమర్పిస్తున్న ప్రభుత్వాలు

భద్రాచలం: ‘జానకి దోసిట కెంపుల ప్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములె తలంబ్రాలుగా..’అంటూ సీతారాముల కల్యాణ తలంబ్రాల విశిష్టత తెలిపారు ఓ కవి. భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో ఉంచుకున్నా అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలో ఏటేటా శ్రీరామనవమి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు పొందే భక్తుల సంఖ్య పెరుగుతోంది.

తానీషా కాలం నుంచి..

భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తులతోపాటు రాజ్యమంతా (ప్రభుత్వం) రామయ్య సేవలో గడపాలనే తలంపుతో తానీషా ప్రభువు ముత్యాలను సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా కొనసాగించాలని శాసనం కూడా చేశారు. నిజాం నవాబు హయాంలో ధంసా పాలనా కాలంలో కొంత కాలం ముత్యాల తలంబ్రాలను పంపడం నిలిపేయగా, రాజ్యంలో కలతలు, ఉపద్రవాలు సంభవించినట్లు అప్పటి చరిత్ర కారులు పుస్తకాల్లో తెలిపారు. తర్వాత పగ్గాలు చేపట్టిన నిజాం నవాబులంతా సీతారాముల కల్యాణానికి ప్రభుత్వ తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించగా ఇది నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రభుత్వమే సమర్పించాలని అప్పట్లోనే రూ. 1,350ను ప్రభుత్వ నిధి నుంచి కేటాయిస్తూ ప్రత్యేక జీఓ తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రతీ ఏటా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తున్నారు.

ఏటేటా పెరుగుతున్న భక్తుల ఆసక్తి

ఏటేటా శ్రీ సీతారాముల తలంబ్రాలకు ప్రాచుర్యం పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం 100 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేయగా, భక్తుల డిమాండ్‌ దృష్ట్యా క్రమంగా పెంచుతున్నారు. ఈ ఏడాది 400 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఫాల్గుణ పౌర్ణమి రోజు నుంచి తలంబ్రాలను కలిపే పనులు చేపడతారు. ఇటీవల కాలంలో గోటి తలంబ్రాలు సమర్పించే భక్తులు కూడా పెరుగుతున్నారు. ఐటీసీ సంస్థ ఏటా 100 క్వింటాళ్లను అందజేస్తుండగా, ఏపీ, తెలంగాణలోని భక్తులు మరో 100 క్వింటాళ్ల వరకు అందజేస్తున్నారు. ఇతర బియ్యాన్ని సైతం దేవస్థానం వర్గాలు దాతల ద్వారా సేకరించి తలంబ్రాలను తయారు చేస్తారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేక కౌంటర్ల ద్వారా, ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తలంబ్రాలు అందజేస్తారు.

సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనస్సుకు అధిపతి అని, మనస్సుకు ప్రశాంతతను కలిగించేవాడు చంద్రుడు గనుక అతనికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారని వేద పండితులు పేర్కొంటున్నారు. ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకుంటే దంపతుల మధ్య మరింత అనురాగం పెంపొంది అన్యోన్యంగా జీవిస్తారని చెబుతున్నారు. దీనికి ప్రతీకగా భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తారని పేర్కొటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement