పాలకవర్గం కొలువుదీరినా..
కార్పొరేషన్..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నగర పాలక సంస్థగా అప్‌గ్రేడై ఏడాది కావొస్తోంది. కొత్త పాలకవర్గం కొలువుదీరి నెల గడుస్తోంది. అయినా ఇప్పటివరకు కార్పొరేషన్ తరహా పాలన అందడం లేదు. కనీసం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని కూడా శుభ్రంగా ఉంచడం లేదు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు సుజాతనగర్ మండలంలో ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ 2025, మార్చి 24న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నగర పాలక సంస్థగా మారడంతో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగువుతుందని, ఆధునిక, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయనే ఆశలు చిగురించాయి. కానీ మొదటి పది నెలలపాటు మున్సిపాలిటీ కార్యాలయం బోర్డు మారడం, మున్సిపల్ చైర్మన్ స్థానంలో కమిషనర్ రావడం మినహా పాలన పరంగా మరే విధమైన మార్పు కనిపించలేదు. ఆఖరికి పాల్వంచ, కొత్తగూడెం మున్సిపల్ వెబ్‌సైట్లు సైతం వేర్వేరుగానే సేవలు అందిస్తూ వచ్చాయి. అప్పటికే పాల్వంచకు ఎన్నికలు జరగకపోవడం, కొత్తగూడెంలో పాలక మండలి లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం ఉండేది.
మిగిలిన చోట్ల..
సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు దీటుగా రామగుండం (గోదావరిఖని), మంచిర్యాల, కొత్తగూడెంలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. కొలువుదీరిన వెంటనే రామగుండం కార్పొరేషన్‌లో కొత్త పాలకవర్గం తన మార్క్ చూపించడం మొదలు పెట్టింది. ఆఫీస్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చడం మొదలుపెట్టింది. ముందుగా కార్యాలయంలో గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులు, ఫైళ్లను క్లియర్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నగరంలో కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దడం మొదలెట్టారు. మంచిర్యాలలోనూ ఈ తరహా పరిస్థితి నెలకొంది.
అధికారులు, పాలకవర్గానికి స్పృహ ఏదీ?
కొత్తగూడెం కార్పొరేషన్‌గా మారినా, కొత్త పాలకవర్గం కొలువుదీరినా అందుకు సంబంధించిన మార్పు కనిపించడం లేదు. నగరం సంగతి పక్కన పెడితే, కనీసం కార్పొరేషన్ కార్యాలయంలో పేరుకు పోయిన చెత్త, స్క్రాప్‌ను కూడా తొలగించలేదు. కార్యాలయం లోపల కాగితాల గుట్టలు అల్మరాల్లో బూజుపట్టిపోతున్నాయి. కార్యాలయం వెలుపల పాడుపడిన వాహనాలు దర్శనం ఇస్తున్నాయి. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి, తిరిగి ఎండిపోయి చెత్తకుప్పగా మారినా, వాటిని తొలగించాలనే స్పృహ ఇక్కడ పాలకవర్గానికి, అధికారయంత్రాంగానికి కరువైంది. ప్రతీ విషయంలో ఇంటర్నెట్, సోషల్‌మీడియా, యాప్‌లు దూసుకుపోతున్నాయి. కనీసం కొత్తగూడెం కార్పొరేషన్‌కు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను సరైన రీతిలో ఉపయోగించడంలోనూ నగరపాలక సంస్థ అట్టడుగున ఉండిపోయింది.
న్యాయపరమైన చిక్కులు దాటుకుని కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో అధికార భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మిత్ర పక్షాల ఆధ్వర్యంలో పాలకవర్గం కొలువుదీరింది. తొలి మేయర్‌గా మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్‌గా సిరిపురపు లలిత కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే కమిషనర్‌గా సుజాత కొనసాగుతున్నారు. దీంతో కార్పొరేషన్ స్థాయిలో పాలనసాగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు పాలకవర్గం మార్క్ కనిపించే విధంగా ఒక్క నిర్ణయం కూడా జరగలేదు. ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పుకోతగ్గ ఏ ఒక్క పనీ ఇక్కడ జరగలేదు. కనీసం కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో సైతం సరైన సమాచారాన్ని పొందు పరచడంలో కొత్త పాలకవర్గం విఫలమైంది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో కొత్తగూడెం ప్రొఫైల్ విభాగంలో 60 డివిజన్లను 60 వార్డులుగా పేర్కొన్నారు. తొలిమేయర్‌గా మూడ్ గణేశ్ ఉండగాా.. ఇప్పటికీ వెబ్‌సైట్‌లో చైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి పేరునే కొనసాగిస్తున్నారు. మ్యాప్‌లో కేవలం కొత్తగూడెం పట్టణాన్ని మాత్రమే చూపుతున్నారు.


