చండ్రుగొండ : గ్రామాల సమగ్రావృద్ధికి ప్రభుత్వం ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. మండలంలోని బెండాలపాడు, చండ్రుగొండ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. బెండాలపాడు పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలు, బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్నం భోజనం వంటకాలను, సరుకులను పరిశీలించారు. గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం చండ్రుగొండలో నిర్మాణ దశలో ఉన్న అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని పరిశీలించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించగా, విద్యార్థినులు కలెక్టరేట్ ఎదుట సమస్యల ఏకరువు పెట్టారు. దీంతో స్పందించిన కలెక్టర్ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తిరుమలేష్, సైదురెడ్డి, శ్రీనివాస్, సాయికృష్ణ, సంధ్యారాణి, బయ్యారపు అశోక్, సంజీవరావు, నాయకులు భోజ్యానాయక్, బొర్రా సురేష్ పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులకు అవగాహన ఉండాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇటీవల ఎన్నికై న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన ఉండాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించే ప్రజాప్రతినిధుల శిక్షణపై బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. శిక్షణ విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఐడీ కార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ అంకిత్


