పాల్వంచ: ప్రతీ ఇంటి నుంచి సిబ్బంది చెత్త సేకరించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ జోత్స్న అన్నారు. బుధవారం ఆమె నగర పాలక సంస్థ పరిధిలోని పాల్వంచలో పర్యటించారు. 39వ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు, డ్రెయినేజీ వ్యవస్థ, మున్సిపల్ చెత్త వాహనాల చెత్త సేకరణ, విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో కమర్షియల్ ట్రాక్టర్ చెత్త సేకరణ, డీఆర్‌సీసీ, బయోమైనింగ్ పనితీరును, కలెక్టరేట్ ఏరియాలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని, క్రమం తప్పకుండా ఇంటింటి చెత్త సేకరణ జరగాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రవిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


