పట్టాలెక్కేనా ? | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కేనా ?

Mar 11 2026 7:45 AM | Updated on Mar 11 2026 7:45 AM

ఏపీ వాటాపై స్తబ్దత

దశాబ్దాలుగా పెండింగ్‌లోనే మగ్గుతున్న పనులు

గతేడాదే గళం విప్పిన ఏపీ ఎంపీలు

నిర్మాణ వ్యయం విషయం ఎటూ తేల్చని ఆంధ్ర సర్కార్‌

పుష్కరాల

నాటికి

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి పుష్కరాల నాటికై నా భద్రాచలంరోడ్‌ – కొవ్వూరు రైల్వే లైన్‌ను పట్టాలెక్కించేందుకు గతేడాది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉంటున్నాయి. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రాజమండ్రి స్టేషన్‌లో అభివృద్ధి పనులు త్వరగా చేయాలని, అలాగే కొవ్వూరు – భద్రాచలంరోడ్‌ రైల్వే లైన్‌ పనులు కూడా చేపట్టాలని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరీ గతేడాది జూలైలో దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. అంతకుముందు 2025 ఏప్రిల్‌లో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ ఇదే అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. ఎన్డీయే సర్కారులో భాగస్వాములుగా ఉన్న ఎంపీల నుంచి ఒత్తిడి రావడంతో ఈ రైల్వేలైన్‌ పనుల్లో కదలిక వస్తుందనే నమ్మకం కలిగినా.. నిరాశే మిగిలింది.

వ్యయం చెరి సగం..

భద్రాచలంరోడ్‌ (కొత్తగూడెం) నుంచి కొవ్వూరు వరకు నూతన రైల్వేలైన్‌ నిర్మాణంపై తొలిసారిగా 1969 – 70 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికి 55 ఏళ్లు గడిచినా ఈ లైన్‌ పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకోలేదు. అనేక ఎత్తుపల్లాల నడుమ 2011 – 12 బడ్జెట్‌లో దీనికి రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 199.60 కి.మీ. నిడివి కలిగిన ఈ మార్గం నిర్మాణ వ్యయంలో సగం భరించేలా అప్పటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీంతో 200 కి.మీ. రైలు మార్గంలో దాదాపు 100 కి.మీ. నిర్మాణ వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలంరోడ్‌ నుంచి సత్తుపల్లి వరకు సుమారు 54 కి.మీ. నిర్మాణ వ్యయాన్ని బొగ్గు రవాణా అవసరాల దృష్ట్యా తెలంగాణ తరఫున సింగరేణి సంస్థ భరించింది. దీంతో ఈ రైలు నిర్మాణంలో రాష్ట్ర బాధ్యత నెరవేర్చినట్టయ్యింది. మిగిలిన పనులు ముందుకు సాగాలంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాల్సి ఉంది.

రెండు రాష్ట్రాలకు లబ్ధి

కొవ్వూరు – భద్రాచలంరోడ్‌ రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో ఉన్న ఏజెన్సీ నియోజకర్గాలకు రవాణా సౌకర్యాలు మెరగువుతాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఏపీలో జంగారెడ్డిగూడెం, పోలవరం, కొవ్వూరు నియోజకర్గాలకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. విద్య, వైద్య పరంగా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న కాజీపేట – డోర్నకల్‌ – విజయవాడ – విశాఖపట్నం రైలు మార్గానికి సుమారు 100 కి.మీ. తక్కువ నిడివితో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు, దిగుమతులు చేసుకునే వీలు కలుగుతుంది.

భద్రాచలంరోడ్‌ – కొవ్వూరు రెల్వే లైన్‌ నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ తరఫున నిర్మాణ వ్యయం వాటా చెల్లింపు విషయంలో అక్కడి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు 150 కి.మీ. నిర్మించే నూతన రైలు మార్గానికి రూ.2,155 కోట్ల వ్యయం అవుతుందని గతేడాది తేల్చారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పనుల్లో కదలిక తెచ్చేందుకు ఏలూరు, రాజమండ్రి ఎంపీలు తమ వంతు ఒత్తిడి తీసుకొచ్చినా, నిర్మాణా వ్యయం చెల్లింపు విషయంలో ఏపీ సర్కార్‌ నుంచి ఎటువంటి ప్రయత్నాలూ జరగడం లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున మొత్తం వ్యయం రైల్వే శాఖనే భరించేలా ఒత్తిడి తెస్తున్నారా అంటే అదీ లేదు. ఫలితంగా కేవలం ప్రకటనలకే అక్కడి ప్రభుత్వం పరిమితం అవుతోంది.

నెరవేరని భద్రాచలం రోడ్‌ – కొవ్వూరు రైల్వేలైన్‌ కల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement