మిగులు కార్మికులు 10 వేల మంది..
● 2030 నాటికి మూతపడనున్న 10 గనులు ● సంస్థలో అదనం కానున్న మరో 10 వేల మంది కార్మికులు ● తగ్గిపోనున్న 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
రుద్రంపూర్: దక్షిణ భారత దేశానికే తలమానికమైన సింగరేణి సంస్థకు రానున్న నాలుగైదు ఏళ్లలో గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. 2030 సంవత్సరం నాటికి మరో 10 గనులు మూతపడే అవకాశం ఉంది. సంస్థలో ఒకప్పుడు 56 భూగర్భ గనుల్లో సుమారు 1.20 లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. గనులు కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల్లో 18 ఓపెన్‌కాస్ట్ గనులు, 19 భూగర్భ గనుల్లో సుమారు 39వేల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా, 1.50 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగలుగుతున్నారు.
మూతపడే గనులివే..
సత్తుపల్లి ఏరియా పరిధిలోని కిష్టారం ఓసీ, మణుగూరులోని పీకే ఓసీ, కొడాపురం భూగర్భ గని, కోయగూడెం ఓసీ–2, బెల్లంపల్లి రీజయన్‌లోని కేకే–5, శ్రీరాంపూర్–1 ఇంక్‌లైన్, న్యూటెక్, ఆర్కే–5, భూపాలపల్లిలోని కేటీకే–6, గోదావరిఖని–11 గనులు మూడు, నాలుగేళ్లలో మూతపడే అవకాశం ఉంది. ఆయా గనుల్లో సుమారు 10 వేల మంది పర్మనెంట్, మరో 8 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఏడాదికి సుమారు 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు. గనులు మూతపడితే సింగరేణి వార్షిక లక్ష్యంలో మరో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి వెనుకబడనుంది.
బకాయిలు రూ.45 వేల కోట్లు
సింగరేణి 25 ఏళ్లుగా లాభాలు గడిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సంస్థకు సుమారు రూ.45 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గత, ప్రస్తుత ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సింగరేణి కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో కొన్ని ప్రైవేటు పరిశ్రమలు ఇతర దేశాల నుంచి వచ్చిన బొగ్గును కొంటున్నాయి. బొగ్గు విక్రయించినా పైసలు రాక, ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగదారులకు అమ్మలేక సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. నెలకు సుమారు రూ.500 కోట్లు కార్మికులు, అధికారులకు వేతనాలు, సుమారు రూ.100 కోట్ల వరకు ఓబీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బు కోసం కూడా ఫైనాన్స్ విభాగం అధికారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
సంస్థలో ఇప్పటికే సుమారు 1,500 మంది కార్మికులు అధికంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత మార్చి నుంచి మెడికల్ బోర్డులు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ప్రతీ నెల రెండుసార్లు మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహిస్తే సుమారు రెండు, మూడు వందల మంది కార్మికులను ఇన్‌వ్యాలిడేషన్ చేసి, వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పటికే కార్మికులు అధికంగా ఉన్నారని, మళ్లీ కారుణ్య నియామకాలు చేపడితే సంస్థకు భారమవుతుందని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 11 నెలలుగా మెడికల్ బోర్డులు నిర్వహించడం లేదు. కారుణ్య నియామకాలకు ఎంపికై న సుమారు 300 మందికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం లేదు. గనులు మూతపడితే సంస్థకు మరో 10 వేల మంది కార్మికులు అధికం కానున్నారు. అయితే నాలుగేళ్లలో 2 వేల మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఉంది.


