సౌకర్యాల లేమితో సతమతం
వేధిస్తున్న సిబ్బంది కొరత
పనిచేయని భద్రాచలం కేంద్రం
నూతన భవనం నిర్మించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలో ఉన్న భూసార కేంద్రం శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రైతులకు చెందిన పొలా ల్లోని మట్టి నమూనాలను పరీక్షించి, భూసార ఫలితాలను వెల్లడించాల్సిన కార్యాలయంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1998లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం శిథిలావస్థకు చేరగా, వర్షం వచ్చి గోడలు తడిస్తే విద్యుత్‌షాక్ వస్తోందంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా భూసార కేంద్రం పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండి ఉండడంతో పాముల సంచారం కూడా ఉంటోంది. కొంతకాలం క్రితం ఓ పాము కేంద్రంలోకి హల్‌చల్ చేసిన ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే. భూసార కేంద్రంలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. భూసారకేంద్రంలో మండలస్థాయి ఎస్‌టీఎల్ (సాయిల్ టెస్టింగ్ లేబోరేటర్) ఉంటారు. అసలైతే భూసారకేంద్రంలో ఇద్దరు మండలస్థాయి వ్యవసాయాధికారులు ఉండాలి. కానీ, ప్రస్తుతం జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏఓ టెక్నికల్‌గా విధులు నిర్వహించాల్సిన వారిని డిప్యూటేషన్‌పై ఎస్‌టీఎల్‌గా నియమించా రు. మహిళా ఎస్‌టీఎల్‌తో పాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే మరో స్వీపర్ లేదా అటెండర్ స్థాయి మరో మహిళ మాత్రమే భూసార కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పేరుకే రెండు భూసార కేంద్రాలు ఉన్నాయని చెప్పుకోవడమే కానీ భద్రాచలంలో ఉన్న భూసార కేంద్రం గతంలో చాలాకాలం పనిచేయక మూతపడింది. అందుకు కారణం ప్రస్తుతం బోరు పనిచేయడం లేదనే సాకు వినిపిస్తోంది. కేవలం జిల్లా కేంద్రంలో ఉండే భూ సార కేంద్రం మాత్రమే అరకొర వసతులతో పని చేస్తూ రైతులకు సేవలందిస్తోంది. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా నాలుగువేల మంది రైతులకు సంబంధించిన మట్టి నమూనాలకు భూసార పరీక్షలు నిర్వహించారు.
సిబ్బంది కొరత..
భూసార కేంద్రంలో ఇద్దరు ఏఓ స్థాయి ఎస్‌టీఎల్‌లు, ఒక ఏఈఓ, అటెండర్, వాచ్‌మెన్ ఉండాలి. కానీ, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై వచ్చిన ఎస్‌టీఎల్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరో మహిళ తాత్కాలిక ప్రాతిపదికన అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ భూసార దినోత్సవాన్నీ
మరిచారు..
కొత్తగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసా య సంబంధితశాఖల బాధ్యులందరూ కలసి డిసెంబర్ 5న భూసార దినోత్సవం నిర్వహించే వారు. ఎనిమిదేళ్లుగా ఆ ఊసు లేకుండాపోయింది. భూసార దినోత్సవం రోజున జిల్లావ్యాప్తంగా కొందరు రైతులను ఎంపిక చేసి, వారికి వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాగు పద్ధతులు, విత్తన ఎంపికలపై అవగాహన కల్పించేవారు. ఈ సంప్రదాయానికి కూడా తిలోదకాలిచ్చారు.
శిథిలావస్థలో
భూసార కేంద్రం
జిల్లా కేంద్రంలోని భూసార పరీక్ష కేంద్రానికి వెళ్తే అన్నీ అరకొర సౌకర్యాలే. నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే, అవసరమైన సిబ్బందిని, సౌకర్యాలను సమకూర్చాలి. రైతులకు తగిన సేవలను అందించాలి. –వాంకుడోత్ కోబల్, రైతు, రేగళ్ల


