ఇల్లెందురూరల్: నాన్న పిలుస్తున్నాడంటూ ఈ నెల 6వ తేదీన పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని పోలారం గ్రామానికి చెందిన వల్లోజు సత్యనారాయణ ఖమ్మంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు వల్లోజు కల్యాణ్‌చక్రధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కొమరారం ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.
జామాయిల్ చెట్ల నరికివేతపై విచారణ
టేకులపల్లి: సుమారు 15 ఏళ్ల క్రితం మండలంలోని కేఓసీ ఓబీ గుట్టలపై సింగరేణి యాజమా న్యం నాటిన జామాయిల్ మొక్క లు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. ఇటీవల కొందరు వీటిని నరికి అక్రమంగా అమ్ముకుంటున్నట్లు ‘సాక్షి’సహా పలు పత్రికల్లో మంగళవారం కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. సింగరేణి పర్యావరణ అధికారి, సెక్యూరిటీ సిబ్బంది ఓబీ గుట్టలపై జామాయిల్ తోటలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న స్మగ్లర్లు సామగ్రి వదిలేసి పారిపోయారు. ఉద్యోగులు వెళ్లేసరికి నరికిన కొన్ని జామాయిల్ మొక్కలు, గొడ్డలి లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. అయితే, కొద్ది నెలలుగా జామాయిల్ కలప అక్రమంగా తరలిస్తున్నా అధికారులు స్పందించకపోవడం, చివరకు పత్రికల్లో కథనాలు వచ్చాక పరిశీలించినా రక్షణ చర్యలు కట్టుదిట్టం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.
పశువుల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న పశువులను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్ల నుంచి హైదరాబాద్‌కు వాహనంలో పది పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్‌ఐ శ్యాంప్రసాద్ తెలిపారు.
వాట్సాప్ పోస్టింగులపై ఫిర్యాదు
ఇల్లెందు: తన ప్రతిష్టను దిగజార్చే విధంగా నిరాధార ఆరోపణలతో వాట్సాప్ లో తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొత్తకాలనీకి చెందిన మడుగు సాంబమూర్తి మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. తనపై తప్పుగా వాట్సాప్ గ్రూపులలో ఎందుకు ప్రచారం చేస్తున్నారని పోస్టింగ్ పెట్టిన మాళోత్ బాసును ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సీఐ సురేశ్ తెలిపారు.
ఇల్లెందులో చోరీ
ఇల్లెందు: పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన నర్సింహసూరి ఈ నెల 8వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి 9వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండటంతో ఇంట్లో సామగ్రిని పరిశీలించారు. బీరువాలో ఉన్న రూ.60 వేల విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు నర్సింహసూరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సురేశ్ మంగళవారం తెలిపారు.
విద్యార్థుల రాస్తారోకో
దుమ్ముగూడెం: మండలంలోని కె.రేగుబల్లి–2 పాఠశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం చర్ల – భద్రాచలం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పాఠశాల హెచ్‌ఎం భారతిని ఇక్కడే విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా, తోటి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన ఆమె కోసం ధర్నా చేస్తారా? అంటూ గ్రామస్తులు వచ్చి విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వెళ్లారు. ఈ పాఠశాలలో కొన్ని రోజుల క్రితం హెచ్‌ఎం, సిబ్బంది వేధింపులతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఘటనపై ఐటీడీఏ అధికారులు విచారణ సాగిస్తున్నారు. పాఠశాలలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు లేని సమయంలో విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి రాస్తారోకో చేయడం గమనార్హం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే లోగానే విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు.


