విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

Mar 11 2026 7:45 AM | Updated on Mar 11 2026 7:45 AM

మణుగూరు రూరల్‌ : వసతి గృహాల్లోని విద్యార్థినుల అరోగ్యంపై నిర్వాహకులు శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ అన్నారు. మణుగూరులోని జ్యోతిబా పూలే హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయి 17 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా 16 మందికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఒక బాలికను హాస్టల్‌కు పంపించారు. చికిత్స పొందుతున్న వారిని డీఎంహెచ్‌ఓ మంగళవారం పరామర్శించారు. హాస్టల్‌లో తీసుకున్న ఆహారం, ఎదురైన లక్షణాలపై ఆరా తీయగా వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. వారికి మెరుగైన సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక వైద్యాధికారులకు సమాచారం అందించాలని హాస్టల్‌ నిర్వాహకులకు సూచించారు.

విమర్శలకు తావిస్తున్న

ఉపాధ్యాయినుల వైఖరి

మణుగూరు టౌన్‌: జ్యోతిబాపూలే వసతి గృహంలోని ఉపాధ్యాయినుల తీరు విమర్శలకు తావిస్తోంది. 15 మంది బాలికలు అస్వస్థతకు గురైతే మొదట నలుగురిని మాత్రమే చికిత్సకు పంపడం, ఆ తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంప్‌నకు మరో 11 మందిని తరలించడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రోజున నలుగురు విద్యార్థినులు వారి కుటుంబసభ్యులు తెచ్చిన చికెన్‌ బిర్యాని తినడంతో అది వికటించిందని టీచర్లు చెప్పారు. ఆ తర్వాత మరో 11 మందికి ఇదే సమస్య రాగా, వారంతా పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసుకుని తిన్నారని.. ఆ ఫుడ్‌ పాయిజన్‌ అయి ఉంటుందని అన్నారు. విద్యార్థినులు ఒకరిని చూసి మరొకరు వాంతులు చేసుకున్నారని, అందుకే కడుపు నొప్పి వచ్చిందని సోమవారం మరోసారి ప్రకటించారు. ఇలా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, విద్యార్థినులపై హాస్టల్‌ బాధ్యుల నిర్లక్ష్యం, నాసిరకమైన ఆహారంతోనే అస్వస్థతకు గురయ్యారని, ఇంటి నుంచి తెచ్చిన బిర్యానీ వల్లే ఇలా జరిగిందంటూ తల్లిదండ్రులపై ఆ నెపాన్ని మోపే ప్రయత్నం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు మండిపడ్డారు.

ఎవరినీ అనుమతించలే..

విద్యార్థినులు అస్వస్థతకు గురైనప్పుడు వైద్య సిబ్బంది సహా ఎవరినీ హాస్టల్‌ బాధ్యులు లోపలికి అనుమతించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ బాలికలు నిజాలు చెప్పకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మెనూ ప్రకారం భోజనం వడ్డింపుపై విద్యార్థినులు చెబుతుంటూ తరచూ అడ్డుపడ్డారని అంటున్నారు. అస్వస్థతకు గురైన విషయం కనీసం తల్లిదండ్రులకు కూడా సకాలంలో సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే పరిస్థితి ఇలా మారిందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను సోమవారం రాత్రి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మంగళవారం పలువురు సీపీఐ నాయకులు పరామర్శించారు.

డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement