అశ్వారావుపేటరూరల్: ఏపీ రాష్ట్రం నుంచి సరిహద్దులు దాటించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీల ను స్థానిక పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు నుంచి అశ్వారావుపేట మీదుగా సత్తుపల్లి, ఖమ్మం అక్రమంగా తరలిస్తుండగా సోమవారం తెల్ల వారుజామున పట్టణ శివారులో గుర్తించి పట్టుకున్నారు. మూడు లారీలను సీజ్ చేసి మైనింగ్ శాఖకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నిందితుడి బైండోవర్
అశ్వాపురం: పశువులు అక్రమ రవాణా కేసుల్లో నిందితుడుగా ఉన్న, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మోయిజ్ ఖురేషిని సోమవారం సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ మణిధర్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ పశువుల అక్రమ రవాణాకు పాల్పడకుండా రూ.ఐదు లక్షల పూచీకత్తు తీసుకుని బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు.
చోరీకి యత్నం
పినపాక: ఓ వ్యక్తి కిరాణా షాపులో చోరీకి యత్నించగా, గ్రామస్తులు గమనించి దేహశుద్ధి చేశారు. మండలంలోని జానంపేట గ్రామంలో ఓ కిరాణా షాపులో ఆదివారం అర్ధరాత్రి చేగర్శల గ్రామానికి చెందిన యువకుడు చోరీకి ప్రయత్నించాడు. దుకాణం పైన ఉన్న రేకుల తొలగిస్తుండగా శబ్దం రావడంతో గ్రామస్తులు మేల్కొని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.


