సమగ్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధి

Mar 10 2026 7:31 AM | Updated on Mar 10 2026 7:31 AM

భద్రాచలం సుందరంగా ఉండాలి

సమన్వయంతోనే

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) డైరెక్టర్‌ శ్రీరామ్‌ తరణికంటి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా పర్యటనకు రాగా, కలెక్టర్‌ అంకిత్‌, ట్రైనీ కలెక్టర్‌ సౌరబ్‌శర్మ, అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో.. జిల్లా మొత్తం జనాభా, జననాల రేటు, ప్రజల సగటు జీవనకాలం, వ్యవసాయ భూముల విస్తీర్ణం, రహదారుల పొడవు, అటవీ ప్రాంతాల శాతం, సాగునీటి వనరులు, అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్య, డీఆర్‌డీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి వాటిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ అధికారి బాధ్యత నిర్వహణలో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. అధికారులకు తమ శాఖలే కాకుండా ఇతర విభాగాలపైనా అవగాహన కలిగి ఉండాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధిలో వేగం పెరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు విధి నిర్వహణలో 70 శాతం సమయాన్ని కార్యాలయ పనులకు, 30 శాతం సమయాన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ఆలోచనకు కేటాయించాలని సూచించారు. తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతారో, ప్రభుత్వ భవనాల నిర్వహణపైనా అంతే శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా అధికారిని ఒక మండలానికి నోడల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా వారు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలంటౌన్‌: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రతలో ప్రజలు కూడా భాగస్వాములైతేనే భద్రాచలం సుందరంగా విరాజిల్లుతుందని శ్రీరామ్‌ తరణికంటి అన్నారు. గోదా వరి ఘాట్‌ వద్ద కార్మికులతో కలిసి ఆయన సోమవారం పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోదావరి పరిసరాలను, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోకుండా పంచాయతీ సిబ్బంది ప్రత్యే క శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ మ్రిణాల్‌ శ్రేష్ట, తహసీల్దార్‌ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ పూనెం కృష్ణదొర, ఈఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరెక్టర్‌

శ్రీరామ్‌ తరణికంటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement