గురుకుల విద్యార్థినులకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

Mar 10 2026 7:31 AM | Updated on Mar 10 2026 7:31 AM

● మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు ● విచారణ చేపట్టిన బీసీ గురుకులాల డీసీఓ బ్యూలారాణి

● మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు ● విచారణ చేపట్టిన బీసీ గురుకులాల డీసీఓ బ్యూలారాణి

మణుగూరుటౌన్‌: మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై 100 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం కొందరు విద్యార్థినులు బయట నుంచి తెచ్చిన బిర్యానీలు తినగా, రాత్రివేళ 8 గంటల సమయంలో 10 మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. దీంతో గురుకుల సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం నలుగురిని, సాయంత్రం 11 మందిని మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్టల్‌లో వడ్డించిన భోజనమే తిన్నామని, బయటి ఫుడ్‌ తినలేదని చికిత్స పొందుతున్న విద్యార్థినులు తెలిపా రు. మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించి, ఇతర ఫుడ్‌ తిన్నవారితోపాటు హాస్టల్‌లో ఉన్న సుమారు 20 మంది వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి మందులు అందించినట్లు సమాచారం.

డీసీఓ విచారణ..అంతా గోప్యం

హాస్టల్‌లో మొత్తం 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం సాగింది. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్‌ బ్యూలారాణి హాస్టల్‌లో విచారణ చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్యం క్షీణించి 12 గంటలు గడిచినా వారి కుటుంబ సభ్యులకు తెలపకపోవడంపై హాస్టల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్యాంపు నిర్వహించేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని గురుకుల అధికారులు లోపలకు అనుమతించలేదు. గంటసేపు ఎండలోనే నిలబెట్టారు. మహిళా సంఘాలను సైతం లోపలికి రానివ్వలేదు. విచారణపై గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలు విద్యార్థి సంఘాలు, బీఆర్‌ఎస్‌ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్‌, తాళ్లపల్లి యాదగిరిగౌడ్‌, ముద్దంగుల కృష్ణ తదితరులు గంటల తరబడి వేచి చూసినా లోపలికి రానివ్వకపోవడంతో వాగ్వాదానికి దిగారు. వార్డెన్‌, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నీరసంగా, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినులకు పీహెచ్‌సీ సిబ్బంది మందులు అందించగా, మెడికల్‌ క్యాంప్‌ను డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీధర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ పుల్లారెడ్డి, మధువరన్‌ సందర్శించారు. కాగాా చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 100 పడకల ఆస్పత్రిలో పరామర్శించారు. మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు గురిజాల గోపి కూడా విద్యార్థినులను పరామర్శించి, పండ్లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement