ఇక ప్రలోభ పర్వం | - | Sakshi
Sakshi News home page

ఇక ప్రలోభ పర్వం

Feb 10 2026 7:33 AM | Updated on Feb 10 2026 7:33 AM

ఇక ప్రలోభ పర్వం

ఇక ప్రలోభ పర్వం

ఎక్కడా కనిపించని

పురపాలన మేనిఫెస్టో

రెబల్స్‌ తక్కువే అయినా

సై అంటున్న స్వతంత్రులు

ఓట్లు దక్కించుకునేందుకు

తెరచాటు ప్రయత్నాలు

కనిపించని వ్యక్తిగత విమర్శలు

లౌడ్‌ స్పీకర్లలో పాటలు, డప్పు నృత్యాల కోలాహలం ఆగిపోయింది. కాళ్లకు చక్రాలు కట్టుకుని ఇంటింటికీ తిరిగిన అభ్యర్థులు సేద తీరుతున్నారు. వారి గెలుపు కోసం ప్రచార రథాలు ఎక్కి ఎన్నికల నినాదాలు వల్లించిన నాయకులు వ్యూహ రచనల్లో బిజీ అయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం ముగియడంతో కీలక అంకమైన ప్రలోభ పర్వాలకు తెర లేచింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

జోరుగా ప్రచారం

జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతి పక్ష బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులు, బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈసారి రెబల్స్‌ సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. కాంగ్రెస్‌ తరఫున మంత్రిపొంగులేటి శ్రీనివారెడ్డి ప్రధానంగా ప్రచార బాధ్యతలు తీసుకోగా, బీఆర్‌ఎస్‌ నుంచి వద్దిరాజు రవిచంద్ర శ్రమించారు. సీపీఐ తరఫున ఆ పార్టీ జాతీయ నేత కె. నారాయణతో పాటు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మరో అగ్రనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇక పీసీసీ నియమించిన ఇన్‌చార్జ్‌ లు మాత్రం ప్రచార పర్వంలో ‘నామ్‌ కే వాస్తే’ అన్నట్టుగా మిగిలిపోయారు. కొన్ని వార్డులు/డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం చేశారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌..

ప్రచార పర్వం ముగిసిపోవడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు రాజకీ య పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాయి. ప్రతీ ఇంటికి వెళ్లి పోల్‌ చిట్టీలు అందించడంతో పాటు గల్లీల వారీగా ఓటర్లను పోలింగ్‌ బూత్‌కు తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ 20 ఇళ్లకు ఒక కో ఆర్డినేటర్‌ చొప్పున నియమించుకున్నారు. అలాగే ఇతర ఊళ్లలో ఉన్న ఓటర్లను రప్పించే పనులు కూడా మొదలెట్టారు.

అ‘మూల్యమైన’ ఓటు

ఎన్నికల ప్రచారంలో ‘మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన’ అనే నినాదం బాగా వినిపించింది. వాల్‌పోస్టర్లలోనూ ఇదే కనిపించింది. కానీ ప్రచార పర్వం ముగిసిన తర్వాత ప్రధాన రాజకీయ పక్షాల తరఫున పోటీ చేస్తున్న మెజారిటీ అభ్యర్థులు ఓటుకు విలువ కట్టే పనిలో ఉండడం గమనార్హం. ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీలో ఉన్న వారు ఓటుకు ఎంత ఇస్తున్నారు ? దాన్ని బట్టి తామెంత ఇవ్వొచ్చనే అంశంపై బహిరంగంగానే చర్చలు సాగిస్తుండడం విశేషం. ఇక మరికొందరు అభ్యర్థులైతే ఓ వైపు ప్రచారం జరుగుతుండగానే తమ పరిధిలోకి వచ్చే ఓటర్లకు చీరలు, ప్యాంట్‌షర్టుల వంటి బహుమతులు అందించి ‘అడ్వాన్స్‌ బుకింగ్‌’ తరహా ప్రక్రియను ప్రారంభించారు. నిన్నటి వరకు సంక్షేమం, అభివృద్ధి, మచ్చలేని పాలన అంటూ ఊదరగొట్టిన అభ్యర్థులు కీలక సమయంలో అమూల్యమైన ఓటు కు విలువ కట్టడాన్ని ప్రజాస్వామికవాదులు తప్పుపడుతున్నారు. మరోవైపు తమ ఓటుకు ఏ అభ్యర్థి ఎక్కువ ధర చెల్లిస్తాడని చూసే వారి సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసే విధానం ఈ ఎన్నికల్లో కనపించలేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సైతం తమ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని హామీలు ఇవ్వడంపైనే ఫోకస్‌ చేశా యి. కొత్తగూడెంలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్‌ – సీపీఐ సైతం ఎన్నికల ప్రచారంలో ఎదుటి పార్టీపై ఎదురుదాడి చేసేప్పుడు సంయంమనం కోల్పోలేదు. ఇదే సమయంలో రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలు.. అధికారం అప్పగిస్తే తాము చేయబోయే మార్పు ఏంటనే అంశంపై స్పష్టమైన మేనిఫెస్టో ప్రకటించడంలో విఫలమయ్యాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధి నినాదాలకే పరిమితమయ్యాయి. ఇక కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు పైసా ఖర్చులేకుండా ఇంటి వద్దకే పౌర సేవలు అందిస్తామంటూ హామీలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement