ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 10 2026 7:33 AM | Updated on Feb 10 2026 7:33 AM

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో ఈనెల 11న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లపై ఈసీ రాణి కుముదిని సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్‌, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.

ఫిర్యాదుల కోసం కంట్రోల్‌ రూం..

మున్సిపల్‌ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, సైలెన్స్‌ పీరియడ్‌లో అక్రమ ప్రచారాలు, ఎంసీఎంసీ అంశాలు, మీడియా సెల్‌ సమాచారం సహా ఇతర ఎన్నికల ఫిర్యాదులను కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. 24 గంటలూ పనిచేస్తూ, ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం 9381082501 నంబర్‌ను కేటాయించినట్లు వెల్లడించారు.

ప్రచారం ముగిసింది..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్‌ పీరియడ్‌) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికలతో సంబంధం ఉండేలా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అన్ని రకాల ప్రచారాలు నిషేధమని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసీ ఆదేశాల మేరకు ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు.

ర్యాండమైజేషన్‌ పూర్తి..

మున్సిపల్‌ ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు ఓపీఓల చొప్పున నియమించామని, అదనంగా 20 శాతం రిజర్వ్‌ సిబ్బందిని ర్యాండమైజేషన్‌ విధానం ద్వారా కేటాయించామని తెలిపారు. అశ్వారావుపేటలో 42 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 126 మంది ఓిపీఓలు, ఇల్లెందులో 62 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 187 మంది ఓపీఓలు, కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలో 241 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 723 మంది ఓపీఓలను కేటాయించినట్లు వివరించారు.

కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాలి

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు కలెక్టరేట్‌లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ సమయంలో ప్రతీ దశలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని అన్నారు. మొదట మాస్టర్‌ ట్రైనర్‌ పూసపాటి సాయికృష్ణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనలు, విధి విధానాలు, చెక్‌ లిస్టులు తదితర అంశాలను వివరించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్‌, విద్యాచందన, ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి శ్రీరామ్‌, ఎన్నికల పరిశీలకులు అమయ్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ త్రినాథ్‌బాబు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement