సీఎం కప్ కబడ్డీ పోటీల్లో 100 మంది..
●డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి వెల్లడి
సూపర్‌బజార్(కొత్తగూడెం): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఖేలో ఇండియా)లో భాగంగా సోమవారం నిర్వహించిన అండర్ –17 బాలికల కబడ్డీ పోటీల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి 100 మంది బాలికలు హాజ రయ్యారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖేలో ఇండి యా పోర్టల్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వారిని ఖేలో ఇండియా శిక్షణా కేంద్రానికి ఎంపిక చేస్తామని తెలిపారు. క్రీడా పోటీలను ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నరేష్, కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ స్వాతిముత్యం, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది తిరుమలరావు, పి.లక్ష్మయ్య తదితరులు పరిశీలించారు.
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారు..
●సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ముదిగొండ: కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ముదిగొండ మండలం బాణాపురంలో ఏర్పాటుచేసిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బాజీ హనుమంతుతో పాటు గండ్లూరి కిషన్‌రావు, మొక్క చిన్ననర్సయ్య విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. తొలుత గ్రామంలో పార్టీ కార్యకర ్తలు అరుణ పతాకాలు చేబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాన్‌వెస్లీ మాటాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దోచిపెడుతోందని ఆరోపించారు. అంతేకాక ఎరువులపై సబ్సిడీ తగ్గించి రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి స్ఫూర్తితో అసమానతలు లేని సమాజం కోసం కార్యకర్తలకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, రాంబాబు, మన్నేపల్లి సుబ్బారావు, బండి పద్మ, బట్టు పురుషోత్తం, రాయల వెంకటేశ్వర్లు, పాండురంగారావు, కూరపాటి శ్రీనివాసరావు, చింతకాయ రామారావు, కందిమళ్ల తిరుపతి, మరికంటి వెంకన్న, ఇరుకు నాగేశ్వరరావు, కోలేటి ఉపేందర్ పాల్గొన్నారు.


