కుళ్లిన మాంసం విక్రయాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం త్రీటౌన్ పరిధి మూడు బొమ్మల సెంటర్ వద్ద ఓ షాపు నుంచి దుర్వాసన వస్తుండడంతో కుళ్లిన మాంసం విక్రయిస్తున్నారనే అనుమానంతో స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోనూ మటన్ షాప్ నిర్వాహకుడు రాజేందర్ తక్కువ ధరకే కొన్నేళ్లుగా పలు హోటళ్లు, ప్రభుత్వ సంస్థలకు మాంసం సరఫరా చేస్తున్నట్లు తెలియగా, షాప్ నుంచి కొద్దిరోజులుగా తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సోమవారం సమాచారం ఇచ్చారు. దీంతో కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేయగా ఫ్రిడ్జ్‌లో కుళ్లి, బూజు పట్టిన మాంసం బయటపడింది. ఆపై డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు చేరుకుని విచారణ చేపట్టారు. బూజు పట్టి, కొంత మురిగిపోయిన 50 కేజీల మాంసం రెండు వారాల క్రితం కోసినదిగా నిర్ధారించారు. అంతేకాక షాపునకు అనుమతులు లేవని తేల్చారు. కాగా, అధికారుల తనిఖీ సమయాన రోగాల బారిన పడిన గొర్రెలను ఆటోల తీసుకురాగా, ఆరా తీయడంతో ఈ దుకాణంలో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు ఆటో డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. ఈమేరకు షాప్ నిర్వాహకుడు రాజేందర్‌పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ సమక్షాన కేఎంసీ అధికారులు ఖమ్మం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దుర్వాసన రావడంతో
వెలుగులోకి వచ్చిన బాగోతం


