పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి
మణుగూరురూరల్: మండలంలోని విజయనగరం వద్ద ఉన్న ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ పెట్రోల్ బంక్ సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకున్నారు. అనంతరం రూ.500 నోట్ ఇవ్వగా.. దానికి రంగు ఉండటంతో మరొకటి ఇవ్వాలని సిబ్బంది కోరారు. దీంతో వారు వాగ్వాదానికి దిగడమే కాకుండా సిబ్బందిపై దాడి చేశారు. బంకులోని సామగ్రిని ధ్వంసం చేసి, తాము ఇదే గ్రామానికి చెందినవారమని బెదిరించి, పరారయ్యారు. ఘటనపై బంక్ నిర్వాహకులు, సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం
మణుగూరురూరల్: మండలంలోని సమితిసింగారం గ్రామ పంచాయతీ పరిధి అశోక్‌నగర్ ప్రాంతంలో హోండా షోరూమ్ ఎదురుగా గల డివైడర్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో డివైడర్ ధ్వంసమైంది. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ పడిపోయింది. సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.


