ముస్తాబవుతున్న భద్రగిరి
భద్రాచలం: ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అవతరాల దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంచరంగులు, హంసవాహన పనులు వేగంగా సాగుతున్నాయి. బ్రిడ్జి రోడ్డు సెంటర్‌లో ప్రధాన స్వాగత ద్వారం, అభయాంజనేయస్వామి, సూపర్‌మార్కెట్ సెంటర్‌లతో పాటు ఇతర కూడళ్లలో సైతం స్వాగత ద్వారాలు సిద్ధమయ్యాయి. ఈనెల 29వ తేదీ రాత్రి గోదావరిలో తెప్పోత్సవం కోసం వినియోగించే తాత్కాలిక ర్యాంపు నిర్వహణ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన అధికారులు తగు సూచనలు చేశారు.
ఆన్‌లైన్‌లో 719 టికెట్ల విక్రయం..
కాగా ఉత్తరద్వార దర్శనం కోసం ఆన్‌లైన్‌లో 719 టికెట్లను విక్రయించారు. రూ.2వేల విలువగల సెక్టార్ టికెట్లు 353, రూ.1000 విలువైన టికెట్లు 52, రూ.500 విలువైన సెక్టార్ బీ, డీ టికెట్లు 416, రూ.250 విలువైన టికెట్లు 300 ఖాళీగా ఉన్నాయని, వీటిని భక్తులు వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు వివరించారు.


