అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

Dec 18 2025 7:47 AM | Updated on Dec 18 2025 7:47 AM

అనుమా

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

దుమ్ముగూడెం : మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన వివాహిత ఉన్నం శిరీష (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటప్పయ్య కథనం ప్రకారం.. తూరుబాక గ్రామానికి చెందిన మేడి శాంతి పెద్ద కూతురు శిరీషకు గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ఉన్నం మధుబాబుతో 2021లో వివాహం జరిగింది. మధుబాబుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 9న శిరీష తల్లికి ఫోన్‌ చేసి వాంతులు అవుతున్నాయని చెప్పడంతో పుట్టింటికి రప్పించారు. మళ్లీ ఈ నెల 14న వాంతులు కావడంతో భద్రాచలంలోని ఓ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ 16వ తేదీన మృతి చెందింది. మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

లారీ ఢీకొని వ్యక్తి..

సత్తుపల్లిటౌన్‌: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన తోట వరప్రసాద్‌(48) సత్తుపల్లిలో బొగ్గు లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కిష్టారం సమీపంలో రోడ్డు దాటుతుండగా సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన వరప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కళాశాలలో ఘటన

పాల్వంచ: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేటీపీఎస్‌ 7వ దశ కర్మాగారంలో డీఈగా విధులు నిర్వహిస్తున్న బలరాం కు మారుడు శ్రీకేతన్‌ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ సాయి నగర్‌ ఇగ్నైట్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల క్యాంపస్‌లో బుధవారం ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

చోరీ చేసిన మహిళలు అరెస్ట్‌

మణుగూరు టౌన్‌: పంట రుణం కట్టేందుకు వచ్చిన ఓ రైతు నుంచి నగదు కాజేసిన ఇద్దరు మహిళలను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ నాగబాబు కథనం ప్రకారం.. మండలంలోని కొండాయిగూడేనికి చెందిన మామిడిపల్లి సీతారాములు ఈ నెల 15న పట్టణంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు వెన్నెల, పూలమ్మ రైతును మాటల్లో పెట్టి రూ.70 వేలను దొంగిలించి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టగా గుట్టమల్లారంలోని ఓ మఠంలో నిద్రించినట్లు గుర్తించారు. బుధవారం ఊరి శివారు హనుమాన్‌ జంక్షన్‌ వైపు కాలినడకన వెళ్తుండగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళలు చోరీలు చేస్తూ సంచార జీవితం సాగిస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు.

బొగ్గు లారీ బీభత్సం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/రుద్రంపూర్‌: కార్మిక ప్రాంతమైన రామవరంలోని ఎస్సీబీ నగర్‌ వద్ద బుధవారం బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. కోయగూడెం ఓసీ నుంచి రుద్రంపూర్‌లోని ఆర్‌సీహెచ్‌పీకి బొగ్గు రవాణా చేసే టిప్పర్‌ ఎస్పీబీ నగర్‌ వద్ద ఐషర్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత విద్యుత్‌ టవర్‌ను ఢీకొట్టింది. దీంతో టవర్‌ నేలకొరిగింది. లారీలో ఉన్న క్లీనర్‌ కేబిన్‌లో ఇరుక్కుపోయాడు. సింగరేణి రెస్క్యూ ఇన్‌చార్జి అనంతరామయ్య, సిబ్బంది కేబిన్‌ కట్‌ చేసి క్లీనర్‌ను బయటికి తీసి 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బొగ్గు టిప్పర్‌ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి1
1/1

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement