నేటి నుంచి ‘జాగృతి’ జనం బాట
సూపర్‌బజార్(కొత్తగూడెం)/మణుగూరు టౌన్: సామాజిక తెలంగాణ సాధన, ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లాలో గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తారని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు డి.వీరన్న బుధవారం తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. కవిత పర్యటనను జయప్రదం చేయాలని హెచ్‌ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ కొడిపల్లి శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
మద్యం మత్తులో
యువకుల హల్‌చల్
పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న
మరో యువకుడిపై దాడి
సూపర్‌బజార్(కొత్తగూడెం): మద్యం మత్తులో టూవీలర్‌పై వచ్చిన యువకులు పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా, పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడిపై దాడి చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియా పెట్రోల్ బంక్‌లో జరిగింది. బంక్ సిబ్బంది కథనం ప్రకారం.. సదరు యువకులు పలుమార్లు మద్యం తాగి అర్ధరాత్రి పెట్రోలు పోయించుకొని డబ్బులు ఇవ్వలేదని, తమ వేతనం నుంచి యజమానికి డబ్బులు చెల్లించామని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి డబ్బులు ఇవ్వకుండా పెట్రోల్ పోయించుకోవడమే కాకుండా దుర్భాషలాడారని వాపోయారు. బంకులో పనిచేస్తున్న యువకులపై చేయిచేసుకుని రక్తం వచ్చే విధంగా ముఖంపై పిడిగుద్దులతో గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ గన్ లాక్కుని, పెట్రోల్ కొట్టి, లైటర్‌తో వెలిగించి బంక్ పేల్చేస్తానని బెదిరించారని తెలిపారు. ఇదంతా సీసీ టీవీలో రికార్డయిందని బంక్ యజమాని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని బంక్ నిర్వాహకులు, సిబ్బంది వేడుకుంటున్నారు. ఈవిషయమై వన్‌టౌన్ సీఐ కరుణాకర్‌ను వివరణ కోరగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం రాత్రి తెలిపారు.
కొనసాగుతున్న
క్రికెట్ పోటీలు
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని గౌతంపూర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్‌లో జరుగుతున్న కంపెనీ లెవల్ క్రికెట్ పోటీల్లో బుధవారం రెండో రోజు కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల జట్టు శ్రీరాంపూర్ జట్టుపై విజయం సాధించింది. ప్రకాశం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మందమర్రి–బెల్లంపల్లి జట్టుపై ఆర్జీ–1, ఆర్జీ–2 ఏరియా జట్టు గెలిచింది.
ట్రాక్టర్ బోల్తా: తప్పిన ప్రమాదం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం గ్రామంలో బుధవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఎరువుల లోడ్‌తో వినాయకపురం నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఒక్కసారిగా లారీ అడ్డు రావడంతో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా బయట పడగా, త్రుటిలో ప్రమాదం తప్పింది.


