సింగరేణికి అన్యాయం చేస్తే సహించం
కొత్తగూడెంఅర్బన్/మణుగూరుటౌన్: ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ వేలంలో సింగరేణికి అన్యా యం చేస్తే సహించేదిలేదని కార్మిక సంఘాల అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. బుధవారం కొత్తగూడెంలో అఖిలపక్షం, మణుగూరులో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ సమావేశాల్లో నాయకులు మాట్లాడా రు. ఓసీల తవ్వకాల పొడిగింపునకు సంబంధించి సింగరేణి పరిశ్రమకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మణుగూరు పీకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులను సింగరేణికి అప్పగించకపోతే యావత్తు సింగరేణి పరిశ్రమకే నష్టం జరిగే పరిస్థితి తలెత్తుతుందన్నారు. కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. అలాగే డీఎంఎఫ్, సింగరేణి సీఎస్సార్ నిధులు స్థానిక ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించుకోవడం కోసం, బొగ్గు బ్లాక్‌లను సాధించుకోవడం కోసం పరిరక్షణ సమితి పేరిట అన్ని రాజకీయ పార్టీ లు, అన్ని ప్రజా, కార్మిక సంఘాలను కలుపుకుని ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్, నాయకులు వంగా వెంకట్, మల్లికార్జునరావు, రాంగోపాల్, రమణమూర్తి, వీరస్వామి, ఆవుల నాగరాజు, బీ.సురేందర్, ఏ.సురేందర్, శనిగరపు కుమారస్వామి, కిశోర్‌బాబు, ఐఎన్‌టీయూసీ నాయకులు త్యాగరాజన్, ఆల్బర్ట్, పితంబరం, శ్రీనివాస్, చిన్ని, టీబీజీకేఎస్ నాయకులు కాపుకృష్ణ, కూసన వీరభద్రం, నాగెల్లి వెంకటేశ్వర్లు, తుమ్మ శ్రీను, వశికర్ల కిరణ్, సీఐటీ యూ నాయకులు మంద నర్సింహారావు, రాజా రావు, సూరం ఐలయ్య పాల్గొన్నారు.
సమావేశంలో అఖిలపక్ష నాయకులు


