వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఈనెల 14న మొదలైన పవిత్రోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈమేరకు చివరి రోజు రుత్విక్కులు సంతోష్‌కుమార్ శర్మ ఆధ్వర్యాన గణపతి పూజ, పుణ్యావాచనం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు పవిత్రధారణ చేశారు. ఆలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ పవిత్రోత్సవాలు నిర్వహించినట్లు ఈఓ ఎన్.రజనీకుమారి వెల్లడించగా, కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
మంత్రి వ్యవసాయ
క్షేత్రంలో పరిశీలన
దమ్మపేట: మండలంలోని గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన ఆయిల్‌పామ్ తోటలను ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రైతులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి కాసాని నాగప్రసాద్ ఆయిల్‌పామ్ సాగు, నీరు, ఎరువుల వినియోగం, అంతర పంటలు, పెట్టుబడి, ఆదాయంపై అవగాహన కల్పించారు. అలాగే, ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం ద్వారా అందుతున్న రాయితీలను వివరించారు.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 1,023 కి.మీ. మేర రోడ్లు
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై), ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకాల ద్వారా 1,023 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఈ విషయమై ప్రశ్నించారు. దీనికి మంత్రి కమలేష్ సమాధానం ఇస్తూ.. ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,023కి.మీ. నిడివికి గాను రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 478 కి.మీ. మేర 39 రహదారులు, 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తెలిపారు. ఇక 2016లో ప్రారంభించిన ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
నూతన ఓసీల పనుల్లో వేగం
ఇల్లెందు/రుద్రంపూర్: సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఏర్పాటుచేస్తున్న నూతన ఓసీ పనుల్లో వేగం పెంచి బొగ్గు ఉత్పత్తికి సిద్ధం కావాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. ఇల్లెందు ఏరియాలో మంగళవారం పర్యటించిన ఆయన జీఎం వీసం కృష్ణయ్య, ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత జేకే ఓసీ పనులపై ఆరాతీసిన ఆయన పలు సూచనలు చేశారు. అలాగే, కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీలో ఓవర్ బర్డెన్ తొలగింపు పనులపైనా డైరెక్టర్ వెంకటేశ్వర్లు కొత్తగూడెంలోని జీఎం కార్యాలయంలో సమీక్షించారు. పనులను గడువులోగా పూర్తిచేసి నిర్దేశిత సమయానికి ఉత్పత్తిమొదలుపెట్టాలని సూచించారు. కాగా, కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖనిలో వార్షిక భద్రతా వారోత్సవాలు నిర్వహించగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు రక్షణకు ప్రాధాన్యత ఇస్తే ప్రమాదాలు జరగవని తెలిపారు. ఈ సమావేశాల్లో ఈ కార్యక్రమంలో ఇల్లెందు, కొత్తగూడెం ఏరియా జీఎంలు లక్ష్మీపతిగౌడ్, శాలేం రాజు, ఉద్యోగులు నరసింహరాజు, రామస్వామి, గోవిందరావు, జాకీర్ హుస్సేన్, తుకారం, ప్రభాకర్, రవికుమార్,సాయిబాబు, సైదులు, తివారీ, వెంకటేశ్వరరావు, రామ్‌భరోసా మహతో, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు
వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు


