పాఠశాలలకు రేటింగ్
ఇదీ లక్ష్యం..
● జిల్లాస్థాయిలో ఎంపికై న ఎనిమిది స్కూళ్లు ● రాష్ట్ర, జాతీయస్థాయి రేటింగ్‌కు పరిశీలన ● అభివృద్ధి, శుభ్రత, హరిత వాతావరణమే ప్రామాణికం ● జాతీయ స్థాయిలో సత్తా చాటితే రూ.లక్ష వరకు ప్రోత్సాహక బహుమతి
కొత్తగూడెంఅర్బన్: స్వచ్ఛ, హరిత విద్యాలయాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రేటింగ్ ఇచ్చే కార్యక్రమం గత సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాస్థాయి రేటింగ్ ప్రక్రియ పూర్తి కాగా, అవార్డులకు ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యాయి. అయితే, ఆయా పాఠశాలలకు అవార్డుల ప్రదానం ఎన్నికల నేపథ్యాన నిలిచిపోయింది. ఈ మేరకు రాష్ట్ర, జాతీయస్థాయి రేటింగ్ ఇచ్చేందుకు సర్వే గత సోమవారం నుంచి జరుగుతోంది. ఖమ్మం నుంచి విద్యాశాఖ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఆధ్వర్యాన ఎనిమిది పాఠశాలలను పరిశీలిస్తుండగా వివరాలను ఎస్‌హెచ్‌వీఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం రాష్ట్ర, జాతీయస్థాయి బృందాలు పరిశీలించి రేటింగ్ ప్రకటించనున్నాయి. జాతీయస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష వరకు కూడా ప్రోత్సాహక బహుమతి అందనుంది.
ఇవీ ప్రామాణికం..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,685 రేటింగ్ పరిధిలో ఉండగా, ఆయా పాఠశాలల్లో 1,63,657 మంది విద్యార్థులు చదువుతున్నారు. వ్యర్థాల వర్గీకరణ, మితంగా నీటి వినియోగం, వర్షపునీటి సేకరణ, విద్యార్థుల్లో పర్యావరణ, స్నేహపూర్వక అలవాట్లు పెంపొందించడం, మరుగుదొడ్ల శుభ్రత, తాగునీటి వసతి, తరగతి గదులు, వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాలల్లో చెట్ల పెంపకం వంటి అంశాలే కాక విద్యార్థుల సామర్థ్యాలు ప్రామాణికంగా రేటింగ్ కేటాయిస్తారు. పరిశీలన అనంతరం 0–50 మార్కులు వస్తే ఒక స్టార్, 51–74 మార్కులు సాధిస్తే రెండు స్టార్లు, 75–80 మార్కులకు మూడు, 81–89 మార్కులకు నాలుగు, 90–100 మార్కులు సాధిస్తే ఐదు స్టార్ రేటింగ్ ఇస్తున్నారు.
జిల్లా స్థాయికి ఎంపికై న పాఠశాలలు
గతంలో జిల్లాస్థాయి రేటింగ్ ప్రక్రియలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిల్లో బూర్గంపాడు మండలంలోని అంజనాపురం, ఇల్లెందు సంజయ్‌నగర్, బూర్గంపాడు ఎంపీపీఎస్‌లు, భద్రాచలం పబ్లిక్ పాఠశాల, అశ్వాపురం సెంట్రల్ గవర్నమెంట్ అటామిక్ ఎనర్జీ పాఠశాల, మోరంపల్లి జెడ్పీహెచ్‌ఎస్, ఇల్లెందు సత్యనారాయణపురం ఎంపీయూపీఎస్, పాల్వంచ కేజీబీవీ ఉన్నాయి. వీటికి రాష్ట్ర, జాతీయ స్థాయి రేటింగ్ ఇచ్చేందుకు సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.
జిల్లాలోని పాఠశాలలు జాతీయస్థాయి రేటింగ్‌కు ఎంపికయ్యేలా తీర్చిదిద్దాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సూచించాం. మంచి రేటింగ్ సాధించి జాతీయస్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందుతుంది. ఇందుకోసం పచ్చదనం – పరిశుభ్రత విషయంలో శ్రద్ధ కనబరిచేలా పర్యవేక్షిస్తున్నాం.
– నాగలక్ష్మి, డీఈఓ
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వడం.. తద్వారా అవార్డులు, ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పాఠశాలలు మరింత అభివృద్ధి దిశగా పయనిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక పచ్చదనం, పరిశుభ్రత పెరగడంతో పాటుగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పచ్చదనం వైపు దృష్టి సారించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తారని, వర్షపు నీటి సేకరణపై ఆసక్తి పెంచుకుంటారని చెబుతున్నారు.
పాఠశాలలకు రేటింగ్


