ముక్కోటికి పిలుపులు
● జిల్లా జడ్జి, ఐటీడీఏ పీఓ, ఏఎస్పీకి ఈఓ ఆహ్వానం ● ధనుర్మాసోత్సవాలకు తీర్థబిందెతో అంకురార్పణ
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన ఈనెల 29, 30వ తేదీల్లో జరగనున్న తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి రావాలంటూ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌కు ఆలయ ఈఓ కొల్లు దామోదర్‌రావు ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ ఏఎస్‌పీ విక్రాంత్‌కుమార్ సింగ్‌కు ఆహ్వానాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ముక్కోటికి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, వైద్యసేవలు కల్పించాలని సూచించారు. ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ధనుర్మాసోత్సవాలకు అంకురార్పణ
దేవస్థానంలో జరిగే ధనుర్మాసోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిపారు. మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి తీర్థబిందెతో జలాలు తీసుకొచ్చారు. కాగా, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన ఎం. వెంకయ్య – భద్రమ్మ దంపతులు స్వామి వారికి వెండి శఠారీ సమర్పించారు. దీని విలువ రూ.73వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కమనీయంగా సాగింది. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు.. నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
ముక్కోటికి పిలుపులు


