‘మహాలక్ష్మి’తో మహిళలకు ఆదా
● రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి భద్రగిరికి బస్సులు ● ఆర్‌టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
భద్రాచలంటౌన్: రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతోందని, ఇప్పటివరకు చార్జీల రూపంలో మహిళలకు రూ.850 కోట్లు ఆదా అయ్యాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. భద్రాచలం ఆర్టీసీ డిపోకు మంగళవారం వచ్చిన ఆయన మెకానిక్ వర్క్‌షాప్, బస్టాండ్‌ను పరిశీలించారు. అనంతరం ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది వేల బస్సులతో రోజుకు సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో 2,500 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన భద్రాచలం సమీప మండలాలకు బస్సులు నడపడంతో పాటు తెల్లవారుజామున వెంకటాపురం వరకు బస్సు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం ఉద్యోగులు పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేసి, ఎండీని సత్కరించారు.
మణుగూరురూరల్: మణుగూరు డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తనిఖీ చేశారు. డిపో ఆవరణ, పరిసరాలను పరిశీలించిన ఆయన సర్వీసుల నిర్వహణపై ఉద్యోగులతో సమీక్షించారు. మేడారం జాతర కు డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం సర్వీసులు నడపాలని సూచించారు. ఖమ్మం ఆర్‌ఎం సరిరాం, డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య, డిపో మేనేజర్లు రాజ్యలక్ష్మి, శ్యాంసుందర్, ఉద్యోగులు రవీందర్, రామయ్య, రవీందర్, నాగబాబు పాల్గొన్నారు.


