తుది విడతకు ఏర్పాట్లు పూర్తి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఎస్పీ రోహిత్‌రాజ్, ఎన్నికల పరిశీలకుడు సర్వేశ్వర్‌రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్యతో కలిసి మంగళవారం ఆయన ఎన్నికలు జరగనున్న మండలాల ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రితో ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు చేరినందున ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించగానే ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. మొత్తం 1,288 పోలింగ్ కేంద్రాలలో సమస్యాత్మకమైనవి 134, అతి సమస్యాత్మకమైనవి 168, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 184 ఉండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 183 పోలింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద 1,500 మంది పోలీసులతో భద్రతా చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తితే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సూచించారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


