గిరిజన విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి
చర్ల: గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని తీర్చిదిద్దాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. ఇందుకోసం ఐటీడీఏ సమకూర్చిన ఉద్దీపకం పుస్తకాలను వినియోగించాలని తెలిపారు. చర్ల మండలంలోని వద్దిపేట, ఉంజుపల్లిలో గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అధికారుల పేర్లు, ఉద్దీపకం వర్క్‌బుక్‌లోని పలు అంశాలను రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. వెనకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం చర్ల నుంచి పూసుగుప్ప మార్గంలోని రోటింత వాగుపై రూ.4.30 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు నాణ్యతగా, సకాలంలో జరిగేలా పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పి.జయప్రకాష్, రాజ్‌కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఏటీడీఏ పీఓ రాహుల్


