గంజాయిపై ఉక్కుపాదం..!
రాష్ట్ర సరిహద్దులోనూ గంజాయి
రవాణాకు చెక్ పెట్టేలా చర్యలు
భద్రాచలంలో ఆర్టిఫీషియల్
ఇంటెలిజెన్స్ సాయం సీసీ కెమెరాలు
అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు..
శాంతి భద్రతలకు
విఘాతం కలిగించొద్దు..
భద్రాచలంఅర్బన్: గంజాయి దందాకు ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం కేరాఫ్‌గా మారింది. పదో తరగతి, ఇంటర్ చదువుతున్న యువకులు పార్టీల పేరుతో మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు 17 నుంచి 25 ఏళ్ల వయసున్న యువకులే లక్ష్యంగా గంజాయి దందా సాగిస్తున్నారు. భద్రాచలం, సారపాకకు చెందిన చాలామంది యువకులు గంజాయికి బానిసలై.. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి, పలుమార్లు జైలు కు వెళ్లినా తిరిగి అక్రమ రవాణాను ఆపడం లేదు.
పెడ్లర్లుగా మారుస్తూ..
కొందరు యువకులకు తొలుత గంజాయి అలవాటు చేసి, దానికి బానిసలయ్యాక వారినే పెడ్లర్లుగా మారుస్తున్నారు. యువత సైతం ఈజీ మనీకి అలవాటు పడి చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి తీసుకొచ్చి తాము ఉంటున్న కాలనీల్లో మరికొందరికి వాటిని అమ్ముతున్నారు. శివారు ప్రాంతాల్లో గుంపులుగా చేరి, గంజాయి సేవిస్తూ.. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ చైతన్యం కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కాగా, ఏపీ నుంచి జిల్లాలోకి గంజాయి బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల ద్వారా వస్తోందని గుర్తించిన పోలీసులు నిఘా పెంచారు. గంజాయి బృందాలు ఉండే ప్రాంతాలను గుర్తించి.. సాధారణ దుస్తుల్లో వచ్చి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు రావడంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి రవాణా చేస్తూ అనేక మార్లు పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి, వారి ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయితే, ఇటీవల భద్రాచలం మీదుగా కొబ్బరి పీచుల మాటన తరలిస్తున్న సుమారు రూ.కోటి విలువ గల 222 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు.
ముమ్మర తనిఖీలతో
నిఘా పెట్టిన పోలీసులు
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రధాన మార్గాలు, అడ్డదారుల్లోనూ విస్తృత తనిఖీలు చేస్తున్నాం. గంజాయి రవాణా ప్రోత్సహించినా, సహకరించినా కఠిన శిక్షలు ఉంటాయి. ఎవరినీ ఉపేక్షించేది లేదు. మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇప్పటివరకు జిల్లాలో ఈ ఏడాది రూ.30 కోట్లు విలువ గల 6000 కేజీల గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నాం. –బి.రోహిత్‌రాజు, ఎస్పీ
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సహించేది లేదు. గతంలో గంజాయి, గుట్కా తదితర మత్తుపదార్థాలు రవాణా చేస్తూ, లేదా వీటికి సంబంధించిన వ్యాపారం చేస్తూ జైలుకి వెళ్లి, విడుదలైన వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాం. వారు తీరు మార్చుకోకుండా పాత పద్ధతినే కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వారిని తిరిగి జైలుకు పంపిస్తాం.
–విక్రాంత్ కుమార్ సింగ్, ఏఎస్పీ, భద్రాచలం
ఏఐ సాయంతో..
గోదావరి వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సీసీ కెమెరా, వీడియో లైవ్ రికార్డింగ్‌లకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) వ్యవస్థ కూడా తోడైంది. హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ అందించే సాంకేతిక సహకారంతో నిఘా పటిష్టం కానుంది. నంబర్ ప్లేట్ ఆధారిత సమాచారం, నిబంధనలకు అనుగుణంగా వాహనం ఉందా? దానిని ఏమైనా మార్పు చేశారా?.. డ్రైవర్ల ప్రవర్తన.. తదితర సమాచారాన్ని ఏఐ సాయంతో విశ్లేషించనున్నారు. ఎలాంటి సందేహం వచ్చినా వెంటనే ఎస్‌ఎంఎస్, వాయిస్ కాల్ రూపంలో సంబంధిత విభాగాల పోలీసులకు వాహనం వివరాలతో కూడిన అలెర్ట్‌ను పంపుతుంది. రాష్ట్ర మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ సహకారంతో ఈ వ్యవస్థను భద్రాచలం వద్ద ఏర్పాటు చేశారు.
గంజాయిపై ఉక్కుపాదం..!
గంజాయిపై ఉక్కుపాదం..!
గంజాయిపై ఉక్కుపాదం..!


