ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌వైరు చోరీ
కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు మోడెపు వెంకన్నకు చెందిన పొలంలోని 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని కాపర్‌వైరును చోరీ చేశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఇన్‌చార్జ్ ఏఈ రాజశేఖర్ మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు రూ.1.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వెల్లడించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పీవీఎన్ రావు చెప్పారు.
తరలిస్తున్న స్క్రాప్ పట్టివేత
ఇల్లెందు: పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఏరియాలో డీసీఎం వాహనంలో సింగరేణి స్క్రాప్‌ను లోడు చేస్తండగా సింగరేణి సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం సింగరేణి ఎస్‌అండ్‌పీసీ ఆఫీసర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఎంటీఎఫ్ టీం సభ్యులు డీసీఎంలో లోడ్ అవుతున్న స్క్రాప్‌ను పట్టుకుని సెక్యూరిటీ కార్యాలయానికి తరలించారు. సుమారు రూ.20 వేల విలువ చేసే స్క్రాప్ ఇందులో ఉన్నట్లు తెలిసింది. సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పొయ్యిలో పడిన వృద్ధురాలు మృతి
పాల్వంచ: చలి కాచుకునేందుకు కట్టెల పొయ్యి ముందు కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడి గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణ పరిధిలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన బూర సులోచన (65) ఇంటి వద్ద ఒంటరిగా జీవనం సాగిస్తోంది. కాగా సోమవారం ఉదయం 4 గంటల సమయంలో చలి ఎక్కువగా ఉందని ఇంటి ముందు కట్టెల పొయ్యి వెలిగించుకుని కూర్చుంది. నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు పొయ్యిలో పడిపోవడంతో చీరకు మంట అంటుకుని శరీర భాగాలు కాలిపోయాయి. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మంగళవారం మృతురాలి కుమారుడు బూర శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
నూతన గృహంలో సామగ్రి చోరీ
ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ చెక్‌పోస్టు రొంపేడు గ్రామానికి చెందిన వేములపల్లి వెంకటేశ్వరరావు నూతన గృహంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. చర్చిరొంపేడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ఇటీవలే చెక్‌పోస్టురొంపేడులో నూతనంగా ఇల్లు నిర్మించుకొని, గృహ ప్రవేశం చేసి.. పాత ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని విషయం గుర్తించిన గుర్తుతెలియని దుండగులు తలుపులు, ఫ్యాన్లు, విద్యుత్ మోటారు, బాత్‌రూంలోని సామగ్రిని అపహరించారు. బుధవారం చోరీని గుర్తించిన వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌వైరు చోరీ


