ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
టేకులపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ విద్యాచందన సూచించారు. టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల సామగ్రి పంపిణీని ట్రెయినీ కలెక్టర్ మురళి, ఎంపీడీఓ బైరు మల్లీశ్వరితో కలిసి మంగళవారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, మధ్యాహ్నం రెండు గంటలకు లెక్కింపు మొదలుపెట్టాలని తెలిపారు. అభ్యర్థులు రాత పూర్వకంగా కోరితేనే ఒకేసారి రీకౌంటింగ్ చేయాలని సూచించారు. సర్పంచ్ ప్రకటన తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక సాధ్యం కాకపోతే మరుసటి రోజు నిర్వహణకు అనుమతి తీసుకోవాలని తెలిపారు. తహసీల్దార్ వీరభద్రం, ఎంపీఓ జేఎల్ గాంధీ, ఉద్యోగులు శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన


