భక్తులపైనే భారం..
పగల్‌పత్తు ఉత్సవాల నిర్వహణకు దాతలకు పిలుపు
ఆలయంలో ఈ ఏడాది నూతన ఒరవడి
ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు
భద్రాచలం : శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈ ఏడాది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఉత్సవాల ఖర్చులు రాను రాను భారంగా మారుతుండడం, మరోవైపు ప్రభుత్వ సాయం అందకపోవడంతో ఆలయ అధికారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పగల్ పత్తు ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు రోజుకో సంస్థ ఖర్చు భరించి వేడుకల్లో భాగస్వాములు కావాలనే ప్రతిపాదన ఆచరణలో పెట్టారు. దీంతో రామయ్య ఉత్సవ ఖర్చులు దాతలపై వేస్తున్నందుకు బాధపడాలో, ఉత్సవంలో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందించాలో తేల్చుకోలేని సందిగ్ధంలో భక్తులు ఉన్నారు.
పెరుగుతున్న వ్యయం..
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దివ్యక్షేత్రంలో ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు వైభ వంగా జరుగుతాయి. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలం తరలివస్తారు. అలాంటి ఉత్సవాల నిర్వహణ ఆలయానికి తలకు మించిన భారంగా మారుతోంది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఆ ఖర్చు సైతం పెరుగుతోంది. వీటిలో అత్యధికంగా భక్తుల కోసం చేపట్టే తాత్కాలిక వసతులకే వ్యయం అవుతోంది. లైటింగ్, పెయింటింగ్, తాత్కాలిక పనులు, చలువ పందిళ్లు, ఏసీలు, ఎల్‌ఈడీలు తదితర పనుల నిమిత్తం దేవస్థానం నుంచి నిధుల కేటాయిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల పనులకు ఇప్పటికే రూ.80 లక్షలకు టెండర్ దాఖలైంది. వీటికి అదనంగా మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతాయి. శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలకు సుమారు రూ.2 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ ఉత్సవాల ఖర్చంతా హుండీ ఆదాయం నుంచే భరించాల్సి వస్తోంది. స్వామి వారికి, ఆలయ అభివృద్ధికి భక్తులకు సమర్పించే కానుకలు ఇలా ఉత్సవాలకు వినియోగించాల్సి వస్తోంది.
‘పగల్‌పత్తు’లో భాగం కండి..
ఆలయంపై పడుతున్న భారాన్ని తట్టుకునేందుకు ఈ ఏడాది అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టారు. ముక్కోటి ఉత్సవాల్లో మొదటి తొమ్మిది రోజులు స్వామి వారు రోజొక అవతారంలో దర్శనమిస్తారు. వీటిని పగల్ పత్తు ఉత్సవాలు అంటారు. ముక్కోటి తర్వాత జరిగే రాపత్తు ఉత్సవాలను ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల వారే నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చు ఆయా శాఖలే భరిస్తాయి. అయితే ఈ ఏడాది తొలిసారిగా పగల్‌పత్తు ఉత్సవాల్లోనూ రోజొక ధార్మిక సంస్థ లేదా అసోయేషన్లు నిర్వహించేలా వీలు కల్పించారు. ఈ మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్, పలు స్వచ్చంద, ధార్మిక సంస్థలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలకు రోజుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ఆ ఖర్చు భరించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భక్తుల కోసం ప్రభుత్వం నిర్వహించాల్సిన ఉత్సవాలకు సైతం దాతలపై ఆధారపడాల్సి రావడం బాధాకరమని పలువురు అంటున్నారు.
ముక్కోటి ఉత్సవాల్లో భక్తులను భాగస్వాములను చేసేందుకే దాతలను ఆశ్రయించాం. అవతారాల నిర్వహణ అవకాశాన్ని స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు కల్పించాం. తద్వారా దేవస్థానంపై సైతం వ్యయ భారం తప్పుతుంది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారమే ఉత్సవాలు నిర్వహిస్తాం.
– కొల్లు దామోదర్‌రావు, రామాలయ ఈఓ
ప్రభుత్వాలు మారినా.. సాయం సున్నా
భద్రాచల క్షేత్రంలో జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నా, ఆలయం నుంచి పలుమార్లు నివేదించినా కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఉత్సవాల నిర్వహణపై నిర్లక్ష్య వైఖరిలో మార్పు ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేడారం వంటి ఉత్సవాలకు రూ.కోట్ల నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. భద్రగిరి ఉత్సవాలకు నయా పైసా విడుదల చేయడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణపై దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.
ముక్కోటి వేడుకలకు అందని సర్కారు సాయం
భక్తులపైనే భారం..


