రైతులకు ‘కలప’తరువుగా..
ఇతర ప్రాంతాల్లోనూ డిమాండ్..
● జామాయిల్ పంటపై పలువురి దృష్టి ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం ● పత్తి, మిర్చితో వరుస నష్టాలు.. జామాయిల్‌తో నికరాదాయం ● కాగితపు పరిశ్రమతో పాటు ఫ్లైవుడ్ తయారీకి వినియోగం
బూర్గంపాడు: జామాయిల్ సాగు మళ్లీ ఊపందుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటా ఈ పంట విస్తీర్ణం మరింతగా పెరుగుతోంది. గతంలో ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల్లో జామాయిల్ సాగయ్యేది. అయితే 15 ఏళ్ల క్రితం మార్కెట్ ఒడిదుడుకులతో రైతులు ఈ పంటలను తొలగించారు. కానీ పదేళ్లుగా జామాయిల్ కర్ర ధర క్రమంగా పెరుగుతుండడంతో మళ్లీ సాగుపై రైతులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం జామాయిల్ కర్ర ధర టన్నుకు రూ. 8వేల వరకు ఉంది. గత మూడేళ్లుగా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పత్తి, మిర్చి పంటలు రైతులకు వరుస నష్టాలను కలిగిస్తున్నాయి. తెగుళ్లు, పురుగు ఉధృతితో ఈ రెండు పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు వీటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. దీంతో పలువురు రైతులు జామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో ఈ పంట సాగువుతుండగా ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
వేల టన్నుల సరఫరా..
సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీ పేపర్ పరిశ్రమకు రోజుకు వేల టన్నుల జామాయిల్ కర్ర సరఫరా ఆవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను జామాయిల్ సాగుకు ఐటీసీ ప్రోత్సహిస్తోంది. పరిశ్రమకు అవసరమైన జామాయిల్ కర్రను రైతులతో సాగు చేయించి కొనుగోలు చేస్తోంది. అంతేకాక సబ్సిడీపై మొక్కలు అందిస్తోంది. ఒకసారి జామాయిల్ మొక్క నాటితే 12 నుంచి 15 ఏళ్ల వరకు పంటను మార్చాల్సిన అవసరం ఉండదు. ప్రతీ మూడు, నాలుగేళ్లకోసారి కర్ర నరికి ఐటీసీకి విక్రయించుకోవచ్చు. ఎకరం విస్తీర్ణంలో 45 నుంచి 60 టన్నుల వరకు కర్ర దిగుబడి వస్తుండగా రైతులకు రూ. రూ.3.50 లక్షల నుంచి రూ 4.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ పంటకు పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువే. ఒకటి, రెండు సార్లు నీరు పెట్టి ఎరువులు వేస్తే సరిపోతుంది. భూమి కౌలుకు తీసుకున్న రైతులకు సైతం పెట్టుబడితో కలిపి ఎకరాకు ఏటా రూ.30 వేలకు మించి ఖర్చు రాదు. పెట్టుబడి పోగా ఏటా తక్కువలో తక్కువగా ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు ఆదాయం వస్తుంది.
ఇప్పటి వరకు జామాయిల్ కర్రను సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీనే ఎక్కువగా కొనుగోలు చేసేది. ప్రస్తుతం రాజమండ్రి పేపర్ మిల్లు కూడా జిల్లాలో సాగు చేసిన జామాయిల్ కర్ర కొనుగోలు చేస్తోంది. గతంలో కాగితపు పరిశ్రమలే ఈ కర్రను కొనుగోలు చేసేవి. ప్రస్తుతం ఫ్లైవుడ్ తయారీకి కూడా జామాయిల్ కలపనే వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఫ్లైవుడ్ పరిశ్రమలు ఉండడంతో జామాయిల్ కొనుగోలు పెరిగింది. ఒకప్పుడు బంజర భూములు, బీడు భూముల్లోనే ఈ పంట సాగు చేసేవారు. ప్రస్తుతం నీటివనరులు ఉన్న సారవంతమైన భూముల్లోనూ సాగు చేస్తుండడం గమనార్హం. అటవీశాఖ కూడా వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో జామాయిల్ సాగు చేపడుతోంది. అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండగా భవిష్యత్‌లో డిమాండ్ తగ్గుతుందనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నా.. పంట సాగులో మాత్రం వెనుకంజ వేయడం లేదు. తక్కువ పెట్టుబడి, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం వంటి సానుకూల అంశాలతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.


