ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
జానకీ సదనానికి రూ.12 లక్షల విరాళం..
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు చేపట్టిన జానకీ సదనం నిర్మాణానికి ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన శ్రీరంగం వకుళాభాష్యం రూ.12 లక్షల విరాళాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్‌కు దాతలకు రశీదు అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాం
ఎండీ నాగిరెడ్డి వెల్లడి
చుంచుపల్లి: టీజీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కొత్తగూడెంలో నూతన బస్టాండ్ నిర్మాణంపై త్వరలో పరిశీలన చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సమష్టి కృషితో సంస్థ సేవలను మరింతగా విస్తరిస్తామని వివరించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. అనంతరం కొత్తగూడెం బస్టాండ్ ప్రాంగణం, డిపోలో పలు గ్యారేజీలను పరిశీలించారు. ప్రధాన సమస్యలేంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది పలు సమస్యలను ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట ఆర్‌ఎం సరిరామ్, డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య, డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.
నేటి నుంచి
కంపెనీ లెవల్ టోర్నీ
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కంపెనీ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ఫ్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు ఆరు టీమ్‌లను అధికారులు తయారుచేశారు. కొత్తగూడెం – కారొరేట్ ఒక టీమ్‌గా, ఇల్లెందు – మణుగూరు ఏరియాలు కలిపి ఒక టీమ్‌గా ఏర్పాటు చేశారు. ఇక భూపాలపల్లి, రామగుండం రీజియన్, శ్రీరాంపూర్ వేర్వేరుగా, బెల్లంపల్లి – మందమర్రి ఏరియాతో మరో టీమ్‌ను ఎంపిక చేశారు. మొత్తంగా 80 మంది క్రీడాకారులు తమ ప్రతిభ చాటనున్నారు. టోర్నీకి కోలిండియా క్రీడాకారులు, టీమ్ మేనేజర్లు కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన
ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని ఖమ్మం జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ సూచించారు. రాష్ట్ర చిహ్నాలు, ముఖ్యమైన వణ్య ప్రాణులు, ప్రకృతి సంరక్షణను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల్లో పర్యావరణ స్పృ హ పెంచడం, ప్రకృతిపై ప్రేమ, బాధ్యత పెంపొందించడమే లక్ష్యంగా పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ మంజుల, గ్రీన్ వారియర్ జేవీఎస్.చంద్రశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ముత్తంగి అలంకరణలో రామయ్య
ముత్తంగి అలంకరణలో రామయ్య


