మూగబోయిన మైకులు
● పల్లె పోరు ప్రచారాలకు తెర ● ప్రలోభాల ప్రయత్నాల్లో అభ్యర్థులు
చుంచుపల్లి : జిల్లాలో ఈనెల 17న జరిగే గ్రామపంచాయతీ తుది విడత ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడింది. మైకులు మూగబోవడంతో పల్లెల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖర్చుకు వెనకాడకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా డబ్బు, మద్యం పంపిణీ ప్రధానాస్త్రాలుగా రంగం సిద్ధం చేశారు. ఎన్నికల వ్యయ పరిమితితో సంబంధం లేకుండా భారీగా ఖర్చు చేస్తున్నారు. సర్పంచ్ పదవులు మహిళలకు కేటాయించిన గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు కొందరు అభ్యర్థులు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమవుతున్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని పోలింగ్ రోజు వరకు రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరడంతో గ్రామాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి.
145 జీపీలు.. 1,071 వార్డులు
చివరి విడతలో లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీలు, 1,071 వార్డులకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 156 పంచాయతీలు, 1,340 వార్డులకు గాను, కోర్టు తీర్పు నేపథ్యంలో జూలూరుపాడులో సర్పంచ్, 10 వార్డు స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. మరో మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 256 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. ఈ విడతలో పది సర్పంచ్ స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీలకు 470 మంది, 1,071 వార్డులకు 2,802 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మూగబోయిన మైకులు
మూగబోయిన మైకులు


