‘ముక్కోటి’కి పటిష్ట ఏర్పాట్లు
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఆలయ పరిసరాల్లో సీసీ టీవీలు, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రాచలం, పర్ణశాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, భక్తులకు సురక్షిత తాగునీరు, సరిపడా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. మొబైల్ టీమ్‌ల పర్యవేక్షణతో పాటు అంబులెన్సులు, ఏరియా ఆస్పత్రిలో పది పడకలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తెప్పోత్సవంతో పాటు, భద్రాచలం ప్రాముఖ్యత తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సాంప్రదాయ వంటకాలు, వస్తువుల స్టాళ్లు ఏర్పాటు చేయాలని, ఏరు ఉత్సవ పనులు మంగళవారం నుంచే ప్రారంభించాలని సూచించారు. హంస వాహనంపైకి పరిమిత సంఖ్యలోనే అనుమతించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్, ఈఈ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఏఈ శ్యామ్, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, విద్యుత్ శాఖ డీఈ జీవన్‌కుమార్, సతీష్, ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


