పారదోలేందుకు..
సకాలంలో గుర్తిస్తే చికిత్స సులువే
మహమ్మారిని
● వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు ● 18 నుంచి ఇంటింటా కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపు సర్వే
భద్రాచలంఅర్బన్: కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 18 నుంచి 31 వరకు ఇంటింటా రెండో విడత లెప్రసీ సర్వేకు శ్రీకారం చుట్టింది. గత మార్చి 17 నుంచి 30 వరకు మొదటి విడతలో 2,29,336 ఇళ్లలో సర్వే నిర్వహించింది. 1,702 మందికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా, పరీక్షల అనంతరం 25 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు రెండో విడతలో 2,43,336 ఇళ్లను సర్వే చేయనుండగా, 1,407 ఆశా కార్యకర్తలు, 1,436 వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, 290 మంది సూపర్‌వైజర్లు సర్వేలో పాల్గొనున్నారు.
12 నెలల్లో తగ్గిపోతుంది..
మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా ఇది చర్మం, నరాలకు సోకుతుంది. లక్షణాలు బహిర్గతమయ్యేందుకు సగటున 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి ఎవరికై నా రావచ్చు. వంశపరంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6 నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు.
లక్షణాలివే..
చర్మంపై మచ్చలు కనిపించినా, కాళ్లు, చేతులు చచ్చుబడినా, వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. శరీరంపై స్పర్శలేని మచ్చలు, నరాల వాపు, నొప్పి తెలియని పుండ్లు, ముఖంపై గుళ్లలు, చేతులు, పాదాల తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తే కుష్ఠువ్యాధిగా అనుమానిస్తారు. ఇది సోకిన వారికి అంగవైకల్యం సంభవిస్తుందని, దీర్ఘకాలికంగా వేధిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
చికిత్స విధానం..
కుష్ఠువ్యాధి నివారణకు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందుతుంది. బహుళ ఔ చికిత్స(ఎండీటీ)విధానంతో పూర్తిగా నయమవుతుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే అంగవైకల్యాన్ని కూడా నివారించవచ్చు. బాధితులకు మైక్రో సెల్యూలార్ రబ్బర్ పాదరక్షలు ఉచితంగా అందిస్తున్నారు. అంగవైకల్యం పొందితే కన్సట్రక్టివ్ సర్జరీగా కూడా నిర్వహస్తారు. రూ.12 వేలను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు.
కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే సులువుగా తగ్గించవచ్చు. అపోహలు వీడి చికిత్స చేయించుకోవాలి. జిల్లాలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయనే సమాచారాన్ని సేకరించి, వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో లెప్రసీ సర్వే చేపడుతున్నాం. ఈ నెల 18 నుంచి 31 వరకు ఇంటింటి సర్వే చేపడుతున్నాం.
–డాక్టర్ పుల్లారెడ్డి, జిల్లా లెప్రసీ నివారణ అధికారి
పారదోలేందుకు..


