ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య!
● మృతిపై కుటుంబీకుల అనుమానాలు ● మృతదేహంతో జాతీయ రహదారిపై రాస్తారోకో
పాల్వంచ: భార్య, భర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ (39)కు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. హరినాథ్ భార్య ఫారెస్ట్ శాఖలో బీట్ ఆఫీసర్‌గా ములుగు జిల్లా వెంకటాపురం ఏరియాలో పనిచేస్తోంది. దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా గొడవ జరగ్గా, మనస్తాపం చెంది హరినాథ్ ఇంటి ముందు ఉన్న స్లాబ్ హుక్కుకు చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు. రాత్రి రెండు గంటల సమయంలో భార్య గుర్తించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందకు దింపారు. అయితే అప్పటికే మృతి చెందాడు. కోడలుకు వివాహేతర సంబంధం ఉండటంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, పలుమార్లు సర్దిచెప్పామని, గొడవలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదుతో ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహంతో బీసీఎం రహదారిపై ఆందోళన
మృతదేహానికి సోమవారం పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అతడు ఆత్మహత్య చేసుకోలేదని, భార్యనే వేరే వారితో హత్య చేసి ఉండవచ్చని, పోలీసులు విచారణ చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ సెంటర్‌లో బీసీఎం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ఎస్‌ఐలు సుమన్, జీవన్‌రాజ్, కల్యాణి సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య!


