వరినారు.. జాగ్రత్తలు
యాజమాన్య పద్ధతులు
కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ భరత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): యాసంగిలో వరిసాగు కోసం చలి కాలంలో వరినారు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి.భరత్ వివరించారు. నారుమడిలో చలి వల్ల వరిపంట చాలా ప్రభావితమవుతుంది. చలి వల్ల విత్తనం త్వరగా మొలకెత్తదు. నారు సరిగ్గా పెరగదు. పసుపు రంగుకు మారి తరువాత ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతుంది. నారు సరిగ్గా పెరగకపోవడంతో నాట్లు ఆలస్యమవుతాయి. జింక్ లోపం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
యాసంగిలో దమ్ము చేసిన నారుమడిలో మండె కట్టిన విత్తనాలు వేయాలి.
రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని (ఒక కిలో విత్తనం చల్లే ముందు, ఒక కిలో విత్తిన 12–14 రోజుల తరువాత) రెండు కిలోల భాస్వరం, ఒక కిలో పోటాష్‌ను ఇచ్చే ఎరువుతోపాటు, రెండు క్వింటాళ్ల మాగిన కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వానపాముల ఎరువును నారుమడి దుక్కులో వేసి కలియదున్నాలి.
చలి నుంచి నారుమడిని కాపాడేందుకు నారుమడి పైన పాలిథీన్ షీట్ లేదా పట్టాలను ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రల ఊతం సాయంతో సాయంత్రం వేళల్లో కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి.
నారు మంచిగా పెరగటానికి యూరియా పైపాటుగా వేసేటప్పుడు కిలో యారియాకు 2.5 గ్రా. కార్బండాజిమ్+మ్యాంకోజెట్ చొప్పున మిశ్రమ మందును కలిపి నారుమడిలో వేసుకోవాలి.
రాత్రిపూట నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్తనీరు పెట్టాలి.
జింకులోప నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి.


