మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లా పార్సేఘడ్ పోలీస్‌స్టేషన్ పరిధి పిల్లూర్ – కండ్లపర్తి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్‌బాంబును ఓ జవాన్ తొక్కగా, పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ కమలేష్ సైగం, ఏఎస్‌ఐ అమిత్‌కుమార్ యాదవ్‌లను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ వైటీసీ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడటంతో గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన పాయం కృష్ణకుమారి (29) మృతి చెందింది. ఇల్లెందు చర్చిలో ప్రార్థనకు హాజరైన ఆమె ఆలస్యం కావడంతో హనుమంతులపాడులోని బంధువుల ఇంటికి బయలుదేరింది. ఈ మార్గమధ్యలో వైటీసీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై హసీనా సోమవారం తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
చుంచుపల్లి: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం విద్యానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజనేయకాలనీకి చెందిన దోమల సంగయ్య (55) విద్యానగర్ నుంచి రామాంజనేయకాలనీకి వెళ్తున్న క్రమంలో వెనకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారుతో ఢీకొట్టిన వ్యక్తి చలపతిరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.


