సమన్వయంతో పని చేయండి
● ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి ● అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని తరలించాలని, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సరిపడా ఉన్నాయా పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో పాటు వీడియోల ద్వారా రికార్డు చేయాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపునకు అవసరమైన వాహనాలను ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పోలింగ్ అనంతరం ర్యాలీలు, విజయోత్సవాల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి భోజనం, రవాణా వంటి సదుపాయాలు కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. పెద్ద పంచాయతీలైన భద్రాచలం, సారపాక వంటి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు తగినంత పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు.
తొలివిడతలో 159 పంచాయతీలు..
మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, పినపాక, చర్ల, కరకగూడెం మండలాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది అధికారులు, 2,295 మంది సిబ్బంది నియమించామని వివరించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భద్రత కట్టుదిట్టంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, డీఏఓ బాబురావు, డీఎంఓ నరేందర్, ఆర్టీఓ వెంకటరమణ పాల్గొన్నారు.


