రామయ్య క్యాలెండర్లు సిద్ధం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు సిద్ధం చేయగా ఈఓ కొల్లు దామోదర్‌రావు మంగళవారం ఆవిష్కరించారు. తొలుత వీటిని అంతరాలయంలో మూలమూర్తుల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య రంగురంగుల చిత్రాలను క్యాలెండర్, డైరీలలో పొందుపర్చామని తెలిపారు. స్వామివారి అవతారాలు, ముక్కోటి, శ్రీరామవమని వంటి ఉత్సవాల ఫొటోలతో పాటు ఆలయ సమాచారం, ప్రత్యేక, ఆర్జిత పూజల వివరాలతో కూడిన 12 పేజీల క్యాలెండర్ రూ.120, డైరీ రూ.75 చొప్పున విక్రయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భక్తులు, పర్యాటకులు, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానాచార్యులు స్థలశాయి. వేద పండితులు కృష్ణమాచార్యులు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఏఈఓ శ్రవణ్‌కుమార్, ఈఓ సీసీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
రామయ్య క్యాలెండర్లు సిద్ధం


