ముక్కోటి భక్తులకు ఏర్పాట్లు
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో తెప్పోత్సవం, ఏరు ఉత్సవం ఏర్పాటుచేసే ప్రదేశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్పెషల్ సబ్ జైలులో ఖైదీలు తయారుచేస్తున్న హెర్బల్ అగర్‌బత్తీ యూనిట్‌ను, లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సందర్శించారు. క్షణికావేశంలో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లాక ఉపాధి పొందేలా శిక్షణ ఇప్పించాలని జైలు అధికారులకు సూచించారు. ఖైదీలు తయారు చేస్తున్న అగర్‌బత్తీలు బాగున్నాయని, వీటిని స్థానిక మార్కెట్‌లో విక్రయించాలని అన్నారు. వీటితో పాటు పేపర్ కప్పులు, పేపర్ బాక్సుల తయారీ యూనిట్ కూడా పెట్టుకుంటే ఖైదీలకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో కౌజు పిట్టల పెంపకానికి ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేసుకోవాలని జైలర్ ఉపేందర్‌కు సూచించారు. ఆ తర్వాత బ్రిడ్జి పాయింట్‌లో ఉన్న శిశుగృహాన్ని సందర్శించి శిశువులకు, చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. శిశువులు రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారం అందించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో అనాథ పిల్లలను ఆశ్రమాల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, రామాలయ ఈఓ దామోదర్ రావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ డీఈ జీవన్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వెల్లడి


