‘తొలి పోరు’కు ఏర్పాట్లు సిద్ధం
చుంచుపల్లి : జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేశామని డీపీఓ ఎం.సుధీర్‌కుమార్ తెలిపారు. మూడు విడతల జీపీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయని, షెడ్యూల్ ఏరియాలో 457, నాన్ షెడ్యూల్ ఏరియాలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 14, రెండో విడతలో ఎన్నికలు జరిగే వాటిలో 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, వీటి పరిధిలోని 584 వార్డులు కూడా ఏకగ్రీవంగా నిలిచాయని తెలిపారు. మొదటి విడతలో 8 మండలాల్లోని 159 పంచాయతీలు, 1,436 వార్డులు, రెండో విడత ఏడు మండలాల్లో 155 జీపీలు, 1,384 వార్డులు, మూడో విడతలో ఏడు మండలాల్లోని 154 పంచాయతీలు, 1,330 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసం 3,808 పెద్దవి, 520 చిన్న బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. మొత్తంగా 13.50లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించామని, ఇందులో సర్పంచ్ స్థానాలకు సంబంధించి 6.50లక్షల పేపర్లు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,69,048 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వెల్లడించారు. మూడు విడతల ఎన్నికల్లో 12,507 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, ఇందులో పీఓలు 5,091 మంది, ఓపీఓలు 6,106 మంది ఉన్నారని, వీరికి అదనంగా 10 శాతం సిబ్బంది రిజర్వుడ్‌లో ఉంచామని తెలిపారు. వార్డు సభ్యుల పోలింగ్‌కు 200 మంది ఓటర్లు ఉంటే ఇద్దరు ఉద్యోగులతో పాటు ఒకరు అదనపు సిబ్బంది, 200 నుంచి 400 వరకు ఓటర్లు అయితే ముగ్గురు ఉద్యోగులతో పాటు ఒకరు అదనపు సిబ్బంది, 400కు పైగా ఓటర్లు ఉన్న వార్డులకు నలుగురు ఉద్యోగులతో పాటు ఇద్దరు అదనపు సిబ్బందిని కేటాయించామని వివరించారు.
డీపీఓ సుధీర్‌కుమార్ వెల్లడి


