సర్వేలకే పరిమితం!
‘మణుగూరు–రామగుండం’ లైన్‌కు మళ్లీ డీపీఆర్..
ఆలస్యం కారణంగా పెరిగిన నిర్మాణ అంచనా వ్యయం
ఊసేలేని మల్కన్‌గిరి, కిరండోల్ రైలు మార్గాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దశాబ్దాలు గడిచినా తెలంగాణలోని కొత్త రైల్వే మార్గాలకు మోక్షం లభించడం లేదు. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా వెళ్లే నూతన రైలు మార్గాల పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది.
మరో డీపీఆర్ సిద్ధం
మణుగూరు–రామగుండం ప్రాంతాల మధ్య 208 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించాలని పదేళ్ల క్రితం నిర్ణయించారు. కోల్ కారిడార్ రైలు మార్గంగా దీన్ని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలను కలిపే మార్గం కావడంతో ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు మేలు జరుగుతుందని, అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారానికి రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని ప్రగల్భాలు పలికారు. భూ సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఐదేళ్ల క్రితం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ. 2,911 కోట్లుగా అంచనా వేశారు. కానీ సకాలంలో పనులు ప్రారంభం కాలేదు. రైలు మార్గం తాజా పరిస్థితిని వివరించాలని రైల్వే బోర్డును ఇటీవల పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ కోరగా ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) రూపొందించామని చెప్పారు. డీపీఆర్ ప్రకారం నిర్మాణ అంచనా వ్యయం రూ. 3,998 కోట్లకు చేరుకుంది. గత డీపీఆర్‌లో పేర్కొన్న అంచనా కంటే వ్యయం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు పెరిగింది. రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు జరిపితే సరే, లేదంటే అంచనా వ్యయం మళ్లీ పెరగక తప్పదు.
మూడు దశాబ్దాలైనా..
భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు సౌకర్యం కల్పించాలనే డిమాండ్ మూడు దశాబ్దాలుగా నలుగుతోంది. 2011లో సమర్పించిన డీపీఆర్‌లో పాండురంగాపురం నుంచి సారపాక వరకు 13 కి.మీ రైలు మార్గం నిర్మాణానికి రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిర్మాణ వ్యయంలో సగం అప్పటి ఏపీ ప్రభుత్వం భరించాలనే షరతు విధించారు. ఇక అప్పుడు బిగుసుకున్న పీటముడి ఇప్పటివరకు వీడలేదు. రైలుమార్గ నిర్మాణ పనులూ మొదలు కాలేదు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే భద్రాచలం–మల్కన్‌గిరి (ఒడిశాల)ల మధ్య కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024 ఆగస్టులో ప్రకటించారు. అంతకుముందు ఆయన అనేకసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అయినా ప్రకటనల్లో ఉన్న వేగం పనుల్లో కనిపించడం లేదు. నిధులు మంజూరైతే ముందుగా సారపాక – పాండురంగాపురం సెక్షన్‌ను పూర్తి చేయించాలని తెలంగాణ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రైల్వేలైన్ దూరం
మణుగూరు– రామగుండం 208 కి.మీ
భద్రాచలం రోడ్–కొవ్వూరు 151 కి.మీ
భద్రాచలం–మల్కన్‌గిరి 173 కి.మీ
కొత్తగూడెం –కిరండోల్ 180 కి.మీ
కొత్తగూడెం –కొండపల్లి 125 కి.మీ
ముందుకు సాగని కొత్త రైలు మార్గాల నిర్మాణం
భద్రాచలం–కొవ్వూరు లైన్
పూర్తయ్యేదెన్నడో..?
భద్రాచలం–కొవ్వూరు రైల్వేలైన్ దాదాపుగా నలభై ఏళ్లుగా సర్వేలకే పరిమితమవుతోంది. సింగరేణి సహకారం వల్ల సత్తుపల్లి వరకు రైలు మార్గం నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు మందగించాయి. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద రైల్వేశాఖ పెట్టింది. భూమిని సేకరించి ఇస్తే మిగిలిన పనులు తాము చేస్తామని చెబుతోంది. దీంతో ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంపై ఏపీ సర్కార్ మౌనం పాటిస్తోంది. కొత్తగూడెం – కిరండోల్, కొత్తగూడెం– కొండపల్లి మధ్య రైలు మార్గం నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. కానీ నిధులు మంజూరు కాలేదు.


