ప్రతీ వాహనం తనిఖీ చేయాలి
ఎస్పీ రోహిత్ రాజు
చుంచుపల్లి: ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. పోలీస్, ఎన్నికల అధికారులను అడిగి నామినేషన్ ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న స్టాటిస్టిక్ సర్వైలెన్స్ చెక్‌పోస్టును సందర్శించారు. వాహన తనిఖీల వివరాల రిజిస్టర్ నిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టేవిధంగా నగదు, మద్యం తరలించేవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
చర్ల: మండలంలోని దేవరాపల్లి, కుదునూరు, దానవాయిపేట, గొమ్ముగూడెం, దోశిళ్లపల్లి తదితర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ పరిశీలించారు. గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సీఐ రాజువర్మ, ఎంపీడీఓ ఈదయ్య, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ ఉన్నారు.
దుమ్ముగూడెం : మండలంలోని నర్సాపురం, బట్టిగూడెం, రేగుబల్లి, అచ్చుతాపురం, తూరుబాక, ములకపాడు పోలింగ్ కేంద్రాలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీఓ వివేక్‌రామ్, సీఐ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


