ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌

Dec 5 2025 6:48 AM | Updated on Dec 5 2025 6:48 AM

ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌

ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌

పారదర్శకంగా ఉండాలి రోజువారీ ఖర్చులు నమోదు చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణీ కుముదిని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎన్నికల సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్‌ రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్య, అదనపు కలెక్టర్‌ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఏకగ్రీవ స్థానాల్లో ఉపసర్పంచ్‌ ఎన్నిక, పోస్టల్‌ బ్యాలెట్‌, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులపై కమిషనర్‌ సమీక్షించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామం, మండలాల వారీగా వివరాలు సేకరించి సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేసేలా చూడాలని అన్నారు. మొదటి విడత పోలింగ్‌ జరిగే గ్రామాల్లో ఓటు హక్కు ఉండి ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బంది ఈ నెల 8న, రెండో విడత వారికి 12న, మూడో విడత వారికి 15న ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ సూచించారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ , సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లను నియమించాలన్నారు. ఇన్‌చార్జ్‌ డీపీఓ సుధీర్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/టేకులపల్లి /గుండాల : పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో ఉండాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు వి.సర్వేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి గురువారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు, ఏఈఓలు, పోలీస్‌ అధికారులు, ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఎస్‌టీఎస్‌, ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, వీవీటీ బృందాలు నిరంతర పర్యవేక్షించాలని, ప్రలోభాలను అడ్డుకోవాలని ఆదేశించారు. ఏకగ్రీవమైన స్థానాల్లో విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలకురాలు పి.లావణ్య, అదనపు కలెక్టర్‌ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.

నామినేషన్‌ కేంద్రాల పరిశీలన

టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో పలు నామినేషన్‌ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకుడు వి.సర్వేశ్వర రెడ్డి గురువారం సందర్శించారు. నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియపై ఆరా తీశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎంపీడీవో బాలరాజు, తహసీల్దార్‌ ఖాసీం, సీఐ రవీందర్‌ పాల్గొన్నారు.

మణుగూరు రూరల్‌/పినపాక: అభ్యర్థులు రోజువారీ ఖర్చుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని, రశీదులను భద్రపర్చుకోవాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకురాలు పి.లావణ్య సూచించారు. మణుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థులకు గురువారం నిర్వహించిన సదస్సును ఆమె సందర్శించారు. పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యయ పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యాన అభ్యర్థులే కాక వారి ప్రతినిధులు, మద్దతుదారులు చేసిన ఖర్చులన్నీ అభ్యర్థి ఖాతాలోకి చేరతాయని తెలిపారు. ఎన్నికల తనిఖీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ వ్యయ అధికారి కె.ఆదినారాయణ, వ్యయ నోడల్‌ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, సహాయ జిల్లా ఎన్నికల అధికారి, ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ అద్దంకి నరేష్‌, సీఐ పి.నాగబాబు, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement