21న జాతీయ లోక్ అదాలత్
కొత్తగూడెంటౌన్: ఈ నెల 21న కొత్తగూడెం కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్‌లు సంయుక్తంగా గురువారం ఒక ప్రకటనలో కోరారు. కేసులు రాజీ చేసుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ చక్కని వేదిక అని పేర్కొన్నారు. యాక్సిడెంట్, సివిల్, చీటింగ్, చిట్‌ఫండ్ కేసులు, భూతగాదాలు, వివాహ బంధానికి సంబంధించినవి, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్‌లు, చిన్న చిన్న దొంగతనాలు, బ్యాంకు లావాదేవీలు, టెలిఫోన్ బకాయిలు, కొట్లాట, సైబర్ క్రైం, చెక్ బౌన్స్ వంటి కేసులను జాతీయలోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుంటే సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని, అత్యధిక కేసులు పరిష్కరించేలా పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కృషి చేయాలని వివరించారు.
నామినేషన్ల ప్రక్రియ
పకడ్బందీగా చేపట్టాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
చుంచుపల్లి: మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి క్లస్టర్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఏర్పాట్లు, నమోదైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్లు స్వీకరణలో ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చివరి రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీ సుస్మిత, ఎంపీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ అంకుబాబు ఉన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
కొత్తగూడెంఅర్బన్: పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. గురువారం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. అనంతరం ఎంపీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జేబీ శౌరి, అల్లాడి నరసింహారావు, జమ్మల రాజశేఖర్, సురేష్ నాయక్, ఎండీ గౌస్ మోహినుద్దీన్, ఎండీ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం రోశయ్య
సేవలు మరువలేనివి
సూపర్‌బజార్(కొత్తగూడెం): మాజీ సీఎం, మాజీ గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. రోశయ్య నాలుగో వర్ధంతిని కలెక్టరేట్‌లో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం, నిస్వార్థ సేవకే అంకితమైందని గుర్తు చేశారు. జిల్లా యువజన క్రీడా శాఖాధికారి పరంధామరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


