రోడ్లపై బుల్లెట్లు! | - | Sakshi
Sakshi News home page

రోడ్లపై బుల్లెట్లు!

Nov 7 2025 7:27 AM | Updated on Nov 7 2025 7:27 AM

రోడ్ల

రోడ్లపై బుల్లెట్లు!

ఎగిసిపడుతున్న రాళ్లు..

మరమ్మతుల పేరుతో గుంతల్లో వెట్‌మిక్స్‌.. భారీ లోడు కారణంగా పైకి తేలిన కంకర వాహనాల రాకపోల సమయంలో దూసుకొస్తున్న రాళ్లు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రోడ్ల అభివృద్ధి, విస్తరణ సంగతి దేవుడెరుగు కానీ.. కనీసం మరమ్మతులు కూడా సక్రమంగా చేయకపోవడంతో గ్రామస్థాయి నుంచి జాతీయ రహదారి వరకు జిల్లాలోని అనేక ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి. వీటిపై ప్రయాణించేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

గుంతల రోడ్లు..

జిల్లా మీదుగా జగ్‌దల్‌పూర్‌ – విజయవాడ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 30, కొత్తగూడెం – హైదరాబాద్‌ వయా ఇల్లెందు జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 930పీతో పాటు వందల కిలోమీటర్ల ఇతర రహదారులు ఉన్నాయి. ఇందులో పల్లెల నుంచి మండల కేంద్రాలను కలిపే పంచాయతీరాజ్‌ రోడ్లు, మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతో అనుసంధానం చేసే ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. గతేడాది కాలంగా ఈ రోడ్లకు సరైన రీతిలో మరమ్మతులు లేవు. కనీసం రోడ్ల పక్కన జంగిల్‌ క్లియరెన్స్‌ కూడా చేపట్టకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు వస్తే రోడ్డు కిందకు వాహనాన్ని దింపే పరిస్థితి కూడా లేదు. మూలిగే నక్కపై తాటి పండు చందంగా ఈ రోడ్లపై భారీ లోడుతో వెళ్లే ఇసుక లారీతో పరిస్థితి మరింతగా దిగజారింది.

ఇప్పటికి ఇంతే..!

జిల్లాలో ఉన్న గోదావరి తీరానికి ఇరువైపులా 20కి పైగా ఇసుక ర్యాంపులు ఏర్పాటయ్యాయి. ఇక్కడి నుంచి నిత్యం వందలాది లారీల ద్వారా రాష్ట్ర రాజధానికి నిరంతరాయంగా ఇసుక సరఫరా జరుగుతోంది. భారీ లోడుతో వెళ్లే ఇసుక లారీల కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతల సైజులు పెరిగాయి. పంచాయతీ రోడ్లపై ఇసుక లారీల కారణంగా గ్రామాలకు వెళ్లే మిషన్‌ భగీరథ పైపులు పగిలిపోయాయి. స్థానికంగా ఉండే మురుగునీటి పారుదల వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. అన్ని రోడ్లపై భారీ సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. అనేక చోట్ల రాకపోకలు సాగించలేని విధంగా తయారయ్యాయి. దీంతో మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల ప్రజలు ఇసుక లారీల రాకపోకలను అడ్డుకోవడంతో తాత్కాలిక మరమ్మతుల కింద ఇసుక రవాణా జరిగే రోడ్లపై ఏర్పడిన గుంతలను కంకర, సిమెంట్‌ మిశ్రమం(వెట్‌మిక్స్‌)తో పూడ్చారు.

జిల్లాలో రెడ్‌ జోన్లు ఇవే..

చర్ల నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన రహదారిలో సింహభాగం గుంతలమయంగా మారింది. సారపాక నుంచి బూర్గంపాడు వరకు ఉన్న దారి కూడా తాత్కాలిక మరమ్మతుల కారణంగా రాళ్లు తేలి, డేంజర్‌ జోన్‌లోకి చేరింది. ముఖ్యంగా సారపాక, నాగినేనిప్రోలు, గొమ్మూరు వద్ద పరిస్థితి అధ్వానంగా మారింది. కొత్తగూడెం – ఖమ్మం రోడ్డులో జూలూరుపాడు నుంచి జిల్లా సరిహద్దు వరకు ఉన్న సెక్షన్‌లో రోడ్డుపై కంకర తేలింది. ఇల్లెందు – కొత్తగూడెం రోడ్డులో బొమ్మనపల్లి క్రాస్‌, సులానగర్‌, సీతారాంపురం, టేకులపల్లిలో బోడు సెంటర్‌ దగ్గర రోడ్డు నిర్మాణం కోసం వాడిన కంకర రాళ్లు బయటకు తేలాయి. పాల్వంచ – దమ్మపేట రోడ్డులో శ్రీనివాసనగర్‌ కాలనీ నుంచి పూసుగూడెం వరకు చాలా చోట్ల రోడ్లపై గుంతల దగ్గర పోసిన వెట్‌మిక్స్‌ కంకర ప్రమాదకరంగా మారింది. ఏ క్షణం ఏ రాయి బుల్లెట్‌లా దూసుకొస్తుందో తెలియని పరిస్థితి ఈ రోడ్లపై నెలకొంది.

రోడ్లపై ఏర్పడిన గుంతలను వెట్‌మిక్స్‌తో పూడ్చినా ఆ తర్వాత బీటీ లేయర్‌ వేయడంపై నిర్లక్ష్యం వహించారు. పైగా ఈ రోడ్ల మీదుగా భారీలోడు ఇసుక లారీలను వెనువెంటనే నడిపించడం మొదలు పెట్టారు. ఇసుక లారీల లోడ్‌ తట్టుకోలేక గుంతల్లో వేసిక వెట్‌మిక్స్‌ రెండు మూడు రోజులకే కంకర, సిమెంట్‌గా విడిపోయింది. దీంతో పైనుంచి ఏ వాహనం వెళ్లినా దుమ్ము లేస్తోంది. అంతేకాదు వాహనం టైరు అంచు కింద కంకర రాయి చిక్కుకుంటే, పైన ఉన్న బరువు ఒత్తిడికి ఆ రాయి బుల్లెట్‌లా దూసుకోస్తోంది. రాకెట్‌ వేగంతో వచ్చే కంకర రాళ్లు తగిలి కార్లు, ఆటోలు చెడిపోతున్నాయి. ఇవే రాళ్లు మనుషులకు తాకితే ప్రాణపాయం తప్పదు. దీంతో గుంతల వద్ద ప్రయాణం చేసేప్పుడు ఏదైనా భారీ వాహనం వస్తే గుండెలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది.

ఇసుక లారీతో అధ్వానంగా మారిన రహదారులు

రోడ్లపై బుల్లెట్లు!1
1/1

రోడ్లపై బుల్లెట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement